వరంగల్ రైతుల నోట్ల కష్టాలు..

06:39 - November 25, 2016

హైదరాబాద్ : ఎప్పుడు విత్తనాలు, ఎరువులతో ఇబ్బంది పడే రైతులకు ఈ సారి కొత్తగా కరెన్సీ కష్టాలు వచ్చి పడ్డాయి. తమ దగ్గర ఉన్న పాత నోట్లు చెల్లకపోవడంతో విత్తనాలు కొనలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ జిల్లాలో రైతులు పడుతున్న నోట్ల కష్టాలపై 10టీవీ ప్రత్యేక కథనం..! 500, వెయ్యి నోట్ల రద్దు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరంగల్‌ జిల్లాలో రైతులను కరెన్సీ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రబీ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సిద్ధమయ్యారు. అయితే ఒక్కసారిగా పెద్ద నోట్లను రద్దు చేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

ఆర్బీఐ సూచనలు..
విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు రద్దైన పాత నోట్లను విత్తన కంపెనీలు తీసుకోవాలని ఆర్బీఐ సూచించినా యజమానులు మాత్రం సూచనలను పెడచెవిన పెడుతున్నారు. దీంతో రైతులు విత్తనాలు కొనలేక నిరాశగా వెనుదిరుగుతున్నారు. విత్తనాలు దొరకపోగా.. పట్టణానికి రాకపోకలకు అదనపు ఖర్చు అవుతోందని వాపోతున్నారు. ఇప్పటికే వేసిన పంటలకు ఎరువులను వేసేందుకు కూడా చాలా సమస్యలు ఎదురవుతున్నాయంటున్నారు రైతులు. దీంతో పంట వేసి కూడ నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంలో వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని విత్తన కంపెనీ యజమానులకు కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరముందని చెబుతున్నారు. 

Don't Miss