డీఎస్ మళ్లీ సొంతగూటికి ?...

06:31 - May 14, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో డీఎస్‌ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశం టీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతోంది. డీఎస్‌ మళ్లీ సొంతగూటికి వెళ్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే కార్యకర్తల ఒత్తిడి మేరకే సమావేశం ఏర్పాటు చేసినట్టు డీఎస్‌ స్పష్టం చేశారు. మరోవైపు కార్యకర్తలు తమకు పార్టీలో ప్రాధాన్యత దక్కడంలేదని డీఎస్‌ దగ్గర మొరపెట్టుకోగా... సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆయన వారికి హామీనిచ్చారు.

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీఎస్‌ నిజామాబాద్‌లో తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ అర్బన్‌ - రూరల్‌ నియోజకవర్గ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హాజరయ్యారు. డీఎస్‌ ముందు కార్యకర్తలు తమ గోడు వెల్లబోసుకున్నారు. పార్టీలో తమకు ప్రాధాన్యం ఏమాత్రం దక్కడం లేదని మొరపెట్టుకున్నారు. డీఎస్‌ అనుచరులమనే పేరుతో.... తమను పార్టీకి దూరంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో తమకు సముచిత స్థానం కల్పించాలని డీఎస్‌ను కోరారు. అలాగే తమ సమస్యలను, ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తలు డీఎస్‌కు విన్నవించారు.

నిజామాబాద్‌ మండల జెడ్పీటీసీ సభ్యురాలు పుష్పాల శోభ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీర్మానాలు ప్రవేశపెట్టింది. డీఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉండాలని సమావేశంలో తీర్మానించారు. నియోజకవర్గాల్లో కార్యకర్తల ఇబ్బందులను, సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని మరో తీర్మానం చేశారు. సమావేశం అనంతరం మాట్లాడిన డీఎస్‌.. పార్టీలో ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభించేలా చేస్తానని హామీ ఇచ్చారు.

డీఎస్ కార్యకర్తల సమావేశం టీఆర్‌ఎస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. డి.శ్రీనివాస్ తన సొంత గూటికి వెళతారనే ప్రచారం టీఆర్ఎస్‌లో జోరుగా సాగుతోంది. టీఆర్‌ఎస్ నేతల్లో డీఎస్ పట్ల అసహనం వ్యక్తం అవుతుంది. అయితే డీఎస్‌ మాత్రం కేవలం కార్యకర్తల ఒత్తిడి మేరకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొస్తున్నారు. డీఎస్ టీఆర్ఎస్‌లో చేరాక ఇంత వరకు ఎన్నడూ లేని విధంగా సమావేశాన్ని నిర్వహించడంతో టీఆర్‌నేతల్లో కలవరం మొదలయ్యింది.

Don't Miss