అక్కడ నిత్యం కోడిపందాలే

07:43 - January 15, 2018

అసిఫాబాద్ : కోడి పందాలకు పెట్టింది పేరు కోస్తా ప్రాంతం. సంక్రాంతి పండగ వచ్చిందంటే అక్కడుండే సందడే వేరు...  మందూ విందులతో పందాలు కాస్తారన్నది బహిరంగ రహస్యం.. కానీ... ఇప్పుడు  కోడి పందాలు అంటేనే తెలియని మారుమూల ప్రాంతాల్లోనూ కోళ్ళకు కత్తులు కడుతున్నారు.. వేలల్లో పందాలు కాస్తున్నారు... కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్‌లోని దట్టమైన అడవుల్లో... సై అంటే సై అంటున్న పందెం కోళ్ళపై స్పెషల్‌ ఫోకస్‌..  
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో కోడి పందాలు  
ఇప్పటివరకూ కోడిపందాలు అంటే.. సంక్రాంతి పండక్కు కోస్తాలో జరిగే బెట్టింగుల గురించే తెలుసు.. యేడాదిపొడవునా కోడి పందాలు కొనసాగే ప్రాంతాలు కూడా ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు. ఇలా ఏడాది కోడి పందాలు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతాయన్నది చాలా మందికి తెలియదు. మహారాష్ర్ట సరిహద్దు గ్రామాల్లో కొన్ని చోట్ల సంక్రాంతికి కోడిపందాలు జరిగితే... మరికొన్ని ప్రాంతాల్లో నిత్యం  కోళ్ళ కాళ్లకు కత్తులు కట్టే ఉంటాయి.
రహస్యప్రాంతాల్లో కోడిపందాలు
కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని  మహారాష్ర్ట సరిహద్దు మండలాల్లో సంక్రాంతికి  కోడి పందాలకు రంగం సిద్ధమైంది. సిర్ఫూర్‌ నియోజకవర్గంలోని బెజ్జూర్‌ దహేగాం, చింతల మానేపల్లి, కౌటాల, గాజక్‌నగర్ తోపాటు ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని పలు మండలాల్లో  బెట్టింగ్‌ రాయుళ్ళు పందాలకు కాస్కో అంటూ  సిద్ధమైనట్లు తెలుస్తోంది.  పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు రహస్య ప్రాంతాలను ఎంచుకున్నట్లు సమాచారం.
కోడిపందాల పోలీసుల నిఘా
సమయం సందర్బం లేకుండా సాగిస్తున్న కోడిపందాలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు.. నిత్యం గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత యేడాది దహేగాం మండలం గిరివెళ్ళి అటవీ ప్రాంతంలో కోడిపందాల అడ్డామీద దాడి చేశారు. 45మందిని అరెస్టు చేశారు. 60వేల రూపాయల నగదు, 14 బైకులు, 3 ఆటోలు, 8 కోళ్ళను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటు కౌటాల, కాగజ్‌ నగర్ మండలాల్లో కూడా పలు కేసులు నమోదు చేశారు. ఈ  సంవత్సరం  కోడి పందాలపై  ప్రత్యేక దృష్టి పెట్టామని పోలీసు అధికారులు చెబుతున్నారు. కానీ... పోలీసులకు దొరక్కుండా రహస్య ప్రాంతాల్లో పందాలు జరిపేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతి పండగ పూట సరిహద్దు ప్రాంతాల్లో పందెం కోళ్ళు కత్తులు దూస్తుంటే....  బెట్టింగ్‌రాయుళ్ళు వేలల్లో పందెం కాస్తున్నారు.  
 

Don't Miss