భూమి రాలేదని యువకుల ఆత్మహత్యయత్నం

21:44 - September 3, 2017

కరీంనగర్/సిద్దిపేట : దళితులకు భూ పంపిణీ పథకంలో అవినీతి ఇద్దరు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. కరీంనగర్‌ జిల్లాలో ఈ స్కీం అమలు చేస్తున్నారు. బెజ్జంకి మండలం గూడెంకు చెందిన పరశురాములు, శ్రీనివాసులు నిరుపేదలు.. తమకూ భూమి ఇవ్వాలంటూ అధికారుల చుట్టూ తిరిగారు. టీఆర్ఎస్ జడ్పీటీసీ శరత్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస రెడ్డిలకు పదేపదే విజ్ఞప్తి చేశారు. అయితే భూమి కావాలంటే లంచం ఇవ్వాలంటూ... వీరిద్దరితో పాటు... వీఆర్‌వో డబ్బు డిమాండ్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది కొనసాగుతుండగానే భూపంపిణీ జాబితాను ప్రకటించారు.. ఇందులో అనర్హుల పేర్లు ఉన్నాయి.. ఈ లిస్ట్‌చూసి ఆవేదన చెందిన బాధితులు జాయింట్‌ కలెక్టర్‌ను కలిసి తమ బాధను చెప్పుకున్నారు.. అయితే బాధితులకు అండగా నిలవాల్సిందిపోయి.. సెలవురోజువచ్చి ఎందుకు తనను డిస్టర్బ్‌ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని బాధితులు చెబుతున్నారు.

ఎమ్మెల్యే రాలేదు..
ఎవ్వరిని కలిసినా ఉపయోగంలేకపోవడంతో బాధితులు మనస్తాపం చెందారు.. చివరకు ఎమ్మెల్యే రసమయికి ఫోన్‌ చేసి విషయం చెప్పారు.. ఎమ్మెల్యే సూచనతో ఆయన్ని కలిసేందుకు మానకొండూరులోని పార్టీ కార్యాలయానికి వచ్చారు.. ఉదయం నుంచి వేచి చూసినా ఎమ్మెల్యే రాలేదు.. దీంతో యువకులు మనస్తాపం చెందారు.. జరిగిన అన్యాయం తలచుకొని కుమిలిపోయారు.. అక్కడే ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నారు.. మంటలతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.. అంబులెన్స్‌కు ఫోన్‌ చేసినా వెంటనే రాకపోవడంతో... స్థానికులు, పోలీసులు తమ వాహనంలో బాధితుల్ని కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.

కుటుంబసభ్యులు కన్నీరు
యువకుల ఆత్మహత్యాయత్నంతో వారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.. బాధితుడు శ్రీనివాస్‌కు భార్య ఇద్దరు పిల్లలున్నారు.. తమ భర్తను కాపాడాలంటూ కుటుంబసభ్యులంతా కనిపించినవారందరినీ వేడుకోవడం అందరినీ కదలించింది. ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న మంత్రి ఈటెల.. ఎంపీ వినోద్... బాధితుల్ని పరామర్శించారు.. వారిని హైదరాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలించాలని ఆదేశించారు.. వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.. మంత్రి ఆదేశాలతో బాధితులకు హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన వీఆర్‌వోను కలెక్టర్‌ సస్పెండ్ చేశారు. దళితుల ఆత్మహత్యాయత్నంలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపణలొస్తున్నా... సర్కారుమాత్రం వీఆర్‌వోను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకుంది.. అటు ప్రభుత్వ పథకాన్ని అధికార పార్టీ నేతలే బ్రష్టుపట్టించడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Don't Miss