బీజేపీలో చేరిన దామోదర సతీమణి...

13:09 - October 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఇతర పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టికెట్ రాని వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కానీ గురువారం తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న దామోదర రాజనర్సింహ సతీమణి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 

దామోదర రాజనర్సింహ...కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆందోల్ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. సతీమణి పద్మినీరెడ్డిని సంగారెడ్డి నుండి బరిలోకి దింపాలని దామోదర యోచించినట్లు తెలుస్తోంది. గతంలోనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు సంగారెడ్డి శాసనసభ టికెట్ కోసం దామోదర రాజనర్సింహ తీవ్రంగా ప్రయత్నించారు. కుటుంబానికి ఒకటే టికెట్ నిర్ణయం కారణంతో ఆమెకు టికెట్ ఇవ్వలేమని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పడంతో పోటీ యోచనను ఆయన విరమించుకున్నారు. 

గత కొంత కాలంగా సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నపద్మినీరెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. మురళీధర్ రావు సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సంగారెడ్డి నుండి పోటీ చేయాలని పద్మినీ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. పద్మినీరెడ్డి చేరికను స్వాగతిస్తున్నామని, ఆమె సేవలను వినియోగించుకుంటామని మురళీధర్ రావు తెలిపారు. భార్యభర్తలు వేరే పార్టీల్లో ఉండడం తప్పు కాదని బీజేపీ నేత లక్ష్మణ్ పేర్కొన్నారు. మరి సతీమణి ిఇతర పార్టీలో చేరడంతో దామోదర కూడా బీజేపీలో చేరుతారా ? అనే చర్చ జరుగుతోంది....

Don't Miss