సిద్ధిపేటలో డేంజరెస్ ఆక్సిడెంట్...

06:36 - May 27, 2018

సిద్దిపేట : జిల్లా ప్రజ్ఞాపూర్‌లో ఓ లారీ సృష్టించిన బీభత్సంలో 12 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిశాయి. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో నవతెలంగాణ రిపోర్టర్‌ లక్ష్మణ్‌ ఉన్నారు. అతని కుటుంబానికి చెందిన 8 మంది మృతిచెందడంతో పెద్దమ్మగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న మరో నలుగురూ మృతి చెందారు. సురభి దయాకర్‌రావుఫార్మసీ కళాశాల దగ్గర జరిగిన ఈ ప్రమాదం.. 12 నిండు ప్రాణాలను బలితీసుకుంది. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఉండటం ఒక విషాదమైతే... నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉండటం మరో విషాదం.

వేసవి సెలవులు ముగుస్తుండడంతో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కేంద్రంలోని పెద్దమ్మగూడేనికి చెందిన గొర్ల మల్లేశం కుటుంబం వేములవాడ రాజన్నను, కొమురెల్లి మల్లన్నను దర్శించుకోవాలని భావించింది. క్వాలిస్‌ వాహనంలో 18 మంది కుటుంబ సభ్యుల బృందం శుక్రవారం ఉదయం బయలుదేరింది. రాజన్నను.. అక్కడి నుంచి కొమురెల్లి మల్లన్నను దర్శనం చేసుకుంది. సంతోషంగా రాజీవ్‌ రహదారిపై ఇంటికి తిరుగుపయనమైంది. మరో 5 నిమిషాల్లో ఆ రహదారిని వదిలి గజ్వేల్‌ మీదుగా తూప్రాన్‌కు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ప్రజ్ఞాపూర్‌లోని సురభి దయాకర్‌రావు కళాశాల సమీపంలో హైదరాబాద్‌ నుంచి మంచిర్యాల వైపునకు 44 మందితో వెళ్తున్న బస్సును.. వెనుక నుంచి వచ్చిన లారీ ఓవర్‌ టేక్‌ చేసింది. అదే సమయంలో బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఆ వేగానికి బస్సు అదుపుతప్పి ఎడమవైపునకు బోల్తా పడింది. బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో లారీ కూడా అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. డివైడర్‌ను దాటి దూసుకొచ్చిన లారీ తొలుత కంటెయినర్‌ను.. అదే ఊపులో క్వాలిస్‌ను బలంగా ఢీకొట్టింది.

మృతుల్లో పెద్దమ్మగూడేనికి చెందిన గొర్ల మల్లయ్య, గొర్ల గండమ్మ, వారి కొడుకు గొర్ల లక్ష్మణ్‌యాదవ్‌, వియ్యంకురాలు ఇల్టం సత్తమ్మ, శ్రీనివాస్‌, మనువరాలు నీహారిక, గుజ్జల సుశీల చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓంకార్‌ అనే బాలుడు మరణించాడు. గొర్ల లక్ష్మణ్‌యాదవ్‌ నవ తెలంగాణ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ఆసిఫాబాద్‌కు చెందిన పందారి రాహుల్‌, నిఖిల్‌, హైదరాబాద్‌కు చెందిన సింధూజ అక్కడికక్కడే చనిపోయారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం చాకుంటకు చెందిన రాజిరెడ్డి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బస్సులోని మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలో మొత్తం 17 మందికి చికిత్స అందిస్తున్నారు.

ప్రజ్ఞాపూర్‌ ప్రమాదం తెలిసిన వెంటనే మంత్రి హరీశ్‌రావు హుటాహుటిన ఆయన ఘటనాస్థలికి చేరుకున్నారు. అదనపు డీసీపీ నర్సింహ్మారెడ్డిని అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి గజ్వేల్‌ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి.. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిని ఓదార్చారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. చికిత్స పొందుతున్న పదినెలల పసిపాప శ్రీవల్లిని చూసి మంత్రి కంటనీరు పెట్టుకున్నారు. క్వాలీస్‌లో ప్రయాణించిన ఆమెను మృత్యుంజయురాలిగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రజ్ఞాపూర్‌ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 

Don't Miss