'యమపురి'కి షార్ట్ కట్..

07:35 - December 19, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ యమపురికి షార్ట్ కట్‌గా మారుతోంది. ఒక్కసారి రింగ్‌రోడ్‌ ఎక్కాక గమ్యస్థానికి చేరుతామా అనేది ప్రశ్నార్థకంగా మారింది. జంటనగరాలకు మెడలో మణిహారంలా ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్‌రోడ్డు నిత్యం ప్రమాదాలతో నెత్తురోడుతోంది. పోలీసుల పర్యవేక్షణలోపం, వాహనచోదకులు మితిమీరిన వేగం..వెరసి ప్రాణాలు బలితీసుకుంటోంది. హడలెత్తిస్తున్న అవుటర్‌ రింగ్‌రోడ్‌ ప్రమాదాలపై 10టీవీ ప్రత్యేక కథనం..! గ్రేటర్‌ హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై తరచూ ప్రమాదకర దృశ్యాలు కనిపిస్తున్నాయ. హైటెక్‌ హంగులతో నిర్మించిన అవుటర్‌ రింగ్‌ రోడ్డు నిత్యం ప్రమాదాలకు నిలయమైంది. ఎంతో మంది కుటుంబాల్లో చీకట్లు నింపింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనాదారులు హడలెత్తిపోతున్నారు. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుతామోలేదో తెలియని పరిస్థితి ఏర్పడింది.

వేగం..
ఔటర్‌రింగ్‌రోడ్డుపై సూచిక బోర్డుల ఏర్పాటులో శాస్త్రీయ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కారణంతోనూ ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. గంటకు 120 కిలోమీటర్ల వేగ పరిమితితో నిర్మించిన ఔటర్‌పై సూచికబోర్డు చూసి అప్రమత్తమయ్యే సరికే.. వాహనం 150 నుంచి 200 మీటర్లు ముందుకు వెళ్లిపోతుంది. ఫలితంగా అయోమయానికి గురవుతున్న వాహనదారులు వేగంగా వెళ్తున్నామన్న విషయాన్ని విస్మరించి అకస్మాత్తుగా వెహికిల్‌ను టర్న్ చేస్తున్నారు. దీంతో అదుపు తప్పి ప్రమాదాల బారినపడుతున్నారు. నిబంధనలు పాటించక పోవడమూ ప్రమాదాలకు మరో కారణం.
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు, మాజీ మంత్రి పులి వీరన్న కుమారుడు ఈ రోడ్డుపైనే ప్రాణాలు వదిలారు. మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ కుమారుడు కూడా రింగ్‌రోడ్‌లో జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. వీరితో పాటు ఎంతో మంది సామాన్యులు ఔటర్‌పై మృత్యువాత పడ్డారు. ట్రాఫిక్‌ను నియంత్రించే భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ రింగ్‌రోడ్‌ ఇలా మృత్యుదారిగా మారడంతో దీనిపై వెళ్లాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. ఇటీవల పెద్ద అంబర్ పేట్ ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు స్పాట్‌లోనే చనిపోయారు. తాజాగా శామీర్‌పేట మండలం దొంగలమైసమ్మ చౌరస్తా వద్ద జరగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

నివారణేది ?
శాస్త్రీయ విధానంలో ఉండాల్సిన సూచికబోర్డుల నుంచి.. వేగ నిర్ధారణ, సీసీ కెమెరాల ఏర్పాటు, నిబంధనలు అమల్లో అధికారులు చూపుతున్న అశ్రద్ధ వాహనదారుల పాలిట మరణశాసనంలా మారుతోంది. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద సర్వీస్ రోడ్లు, ఔటర్ మార్గానికి అనుసంధానం సరిగా లేకపోవడంతో ఓఆర్‌ర్‌పైకి అకస్మాత్తుగా వాహనాలు వస్తున్నాయి. దీంతో అప్పటికే ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనంతో ఒకదానికొకటి ఢీకొట్టే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగిన ప్రతీసారి వేగ నియంత్రణకు చర్యలు తీసుకుంటామంటున్న అధికారుల ప్రకటనలు ఆచరణకు నోచుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఔటర్‌రింగ్‌రోడ్డుపై ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రేటర్‌ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Don't Miss