సహనం కోల్పోతున్న సామాన్యుడు..

18:46 - December 14, 2016

సంగారెడ్డి : పెద్దనోట్ల రద్దుతో సామాన్యుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. సామాన్యుని సాధారణ కష్టాలకు....ఇప్పుడు కరెన్సీ కష్టాలు తోడయ్యాయి. 36 రోజులు గడుస్తున్నా ఇక్కట్లు తీరకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో చిల్లర దొరక్క నానా అవస్థలు పడుతున్న సామాన్య ప్రజల కష్టాలపై ప్రత్యేక కథనం.

నెల దాటినా తీరని చిల్లర కష్టాలు
వారం రోజులు..పదిరోజులు..నెలరోజులు...ఇలా రోజులు గడుస్తున్నాయి. కొన్ని రోజులే కదా అని సహనం వహించారు. నెలరోజులు గడుస్తున్నా చిల్లర కష్టాలు తీరకపోవడంతపై సామాన్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నల్లధనం నిరోధించేదుకు సహకరిస్తుంటే...ఉన్న ధనాన్నే అవసరానికి లేకుండా చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు కూలీలు పనికి వెళ్లలేక...ఇటు ఉద్యోగులు ఆఫీసులకు పోలేక.. క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. తమ డబ్బు తాము తీసుకోవడానికే గంటల తరబడి పడిగాపులు కాయల్సిన దుస్థితి ఏర్పడింది.

బడాబాబుల కోసమే నోట్ల రద్దంటున్న సామాన్యులు
నల్లకుబేరులని బయటకు తీసుకొస్తామన్న మోదీ...దాన్ని ఎంతవరకూ అమలు చేస్తున్నారంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకుల మందు పేద, మధ్యతరగతి కుటుంబాలే తప్ప ఒక్క కుబేరుడు కూడా కనిపించడం లేదంటూ మండిపడుతున్నారు. ఇదంతా బడాబాబుల మంచి కోసమే తప్ప..సామాన్యుల బాగుకోసం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెండు వేలకు చిల్లర ఎక్కడ నుంచి తీసుకు రావాలి
పెద్దనోట్ల రద్దుతో తాము నానా అవస్థలు పడాల్సి వస్తోందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంట తరబడి వేచి చూసి బ్యాంకుల ముందు నిలబడితే రెండు వేల రూపాయల నోటే వస్తోందని చెబుతున్నారు. ఐదు వందల రూపాయలకే చిల్లర కరువై చస్తుంటే..రెండు వేలకు చిల్లర ఎక్కడ నుంచి తీసుకు రావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా డబ్బు మాకివ్వటానికి ఇవ్వడానికి ఇన్ని కష్టాలు పెట్టాలా?
బ్యాంకుల్లో దాచుకున్న తమ డబ్బులను తాము తీసుకోవడానికి ఇన్ని అడ్డులేంటంటూ సామాన్యులు మండిపడుతున్నారు. ఆసుపత్రుల్లో ఉన్న తమ పిల్లల్ని బాగుచేసుకుందామంటే చిల్లర లేదంటూ ఆసుపత్రి సిబ్బంది వెనక్కి పంపుతున్నారని..తీరా బ్యాంకులకు వస్తే 'నోక్యాష్' అంటూ బోర్డులు పెడుతున్నారని చెబుతున్నారు. బ్యాంకుల్లో డబ్బుల్లేవని చెబుతున్న అధికారులు....కోట్ల రూపాయల కొత్త నోట్లతో దొరుకుదున్న నల్ల కుబేరులకు ఆ నోట్లు ఎలా వచ్చేయో చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

నగదు కష్టాలు తీరాలంటే క్యాష్ లెస్ విధానమే నంటున్న బ్యాంక్ సిబ్బంది
మరోవైపు బ్యాంకు అధికారుల మాత్రం తమకు అందుబాటులో ఉన్న నగదును మాత్రమే అందిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న నగదును ప్రజలకు ఇవ్వడానికే ప్రయత్నిస్తామని...అసలు బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోతే తామేమి చెయ్యలేమని చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రజల్లో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించాల్సిన అవసరముందని అంటున్నారు.

తీవ్ర స్థాయిలో వ్యతిరేకత తప్పదంటూ హెచ్చరికలు
ఇన్నాళ్లు సహనంతో ఉన్నామని ... 36 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నోట్ల విషయంలో ప్రత్యామ్నాయం చూపడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. 

Don't Miss