పెద్ద నోట్ల రద్దు....ఊడుతున్న ఉద్యోగాలు

13:51 - January 10, 2017

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీసింది. ఉత్పత్తి, ఉపాధి రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. కొత్త ఉద్యోగాలు లేకపోగా, ఉన్న కొద్దిపాటి ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. దీంతో వేలాది కుటుంబాలకు వీధుల పాలువుతున్నాయని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. 
అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావం 
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మన దేశంలోని అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపింది. పారిశ్రామిక, వ్యవసాయ, రవాణ, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణ  రంగాలపై నిర్వీర్యం చేసింది. ఈ రంగాల్లో పని చేస్తున్న లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ రంగాలు ఇప్పట్లో కోలుకునే అవకాశంలేదని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ఏదైనా తేరుకునే అవకాశం ఉంటే అది మరో రెండు నెలల తర్వాతేనని ఆలిండియా మ్యానుఫ్యాక్చర్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. 
దెబ్బతిన్న ఉపాధి అవకాశాలు 
పెద్ద నోట్ల రద్దు  తర్వాత అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఉత్పత్తి రంగంలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. మోదీ నిర్ణయం తర్వాత మొదటి 34 రోజుల్లోనే కార్మికలోకం ఇప్పటికే 35 శాతం ఉద్యోగాలను కోల్పోయింది.  మరో రెండు నెలల్లో ... మార్చి చివరినాటికి ఇది 60 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అఖిల భారత ఉత్పత్తిదారులు సంఘం అంచనా వేసింది. ప్రధాని మోదీ నిర్ణయం ఉపాధి రంగాన్నే కాదు... ఆదాయాన్ని కూడా దారుణంగా దెబ్బతీసింది. ఇప్పటికే పారిశ్రామిక ఆదాయం  50 శాతం పాడిపోగా,  ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇది  55 శాతానికి చేరుకుంటుందని ఏఐఎంవో  నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రెవిన్యూ నష్టం మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని  ఈ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.
ఉత్పత్తిపై ప్రభావం 
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఉద్యోగాలు పోవడానికి, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడానికి, ఉత్పత్తి తగ్గడానికి కారణాలను కూడా అఖిల భారత ఉత్పత్తిదారుల సంఘం తమ నివేదికల్లో విశ్లేషించింది. నగదు కొరత, చలామణి లేకపోవడం, బ్యాంకులు, ఏటీఎంలలో ఉపసంహరణపై పరిమితులు విధించడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత్‌లో పెట్టుబుడులు పెట్టేందుకు విదేశీయులు సంశయిస్తున్నఅంశాన్ని ఏఐఎంవో  ప్రధానంగా ప్రస్తావించింది.  వస్తుసేవల పన్ను అమలుపై కొనసాగుతున్న అస్థిరత, రూపాయి మారకపు విలువ తగ్గడం కూడా ఉత్పత్తి, ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపింది. తయారు చేసిన వస్తువులకు డిమాండ్‌ లేకపోవడంతో చాలా పరిశ్రమలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉత్పత్తి తగ్గించుకుని, కార్మికులను  తొలగించాయి. రుణాల కోసం కంపెనీలు పంపిన ప్రతిపాదనలను బ్యాంకులు   ఆమోదించకపోవడంతో ఉపాధి, ఆదాయ రంగాలను ప్రభావితం చేసింది. 
నిర్మాణ రంగం కుదేలు 
పెద్ద నోట్ల రద్దు తర్వాత అసంఘటిత రంగంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న నిర్మాణ రంగం కుదేలైంది. ఇళ్లు కొనేందుకు ప్రజల చేతిలో డబ్బులేకపోవడంతో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి, పెద్ద ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు రియల్లర్లు ముందుకు రావడంలేదు. పెద్ద నోట్ల రద్దు పరిణామాలను ప్రభుత్వం ముందుగా గ్రహించకలేకపోవడం, పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్ధం కాకపోవడం కూడా పారిశ్రామిక రంగాన్ని కుదిపేసిందని అఖిల భారత ఉత్పత్తిదారులు సంఘం విశ్లేషించింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై ఏఐఎంవో ఇంత వరకు కేంద్రానికి మూడు నివేదికలు పంపించింది. వీటిలో ఏ ఒక్కదాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని సంఘం ప్రతినిధిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన తమిళనాడు, మహారాష్ట్రపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎక్కువగా ఉందని నివేదించింది.  నోట్ల రద్దు ప్రభావంపై అఖిల భారత ఉత్పత్తిదారుల సంఘం నాల్గవసారి అధ్యయనం చేపట్టబోతోంది. 
 

Don't Miss