ఆర్టీసీపై నోట్ల రద్దు ప్రభావం..

06:36 - November 25, 2016

హైదరాబాద్ : పెద్దనొట్ల రద్దు అంశం ఆర్టీసీపై తీవ్ర ప్రభావాన్నిచూపుతోంది. అసలే నష్టాలతో నడుస్తోన్న సంస్ధలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. మోదీ తీసుకున్న నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీలకు అక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. దీంతో ఉహించని రీతిలో ఆర్టీసీలు నష్టాలు చవిచూస్తున్నాయి. 500,1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా అన్నీ రంగాలు ఆర్ధిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్ధలైన ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. అసలే..ఆర్థిక కష్టాలలో..నష్టాల నావను నెట్టుకొస్తున్నరెండు కార్పొరేషన్లు ప్రయాణికుల లేమితో మరింతగా నష్టాలను చవిచూస్తున్నాయి. పెద్దనోట్లను రద్దుచేస్తూ మోదీ ప్రకటన చేసిన నాటినుంచి నేటి వరకూ తీవ్రస్ధాయిలో నష్టాలను చవిచూస్తున్నాయి.

ప్రతిరోజు రూ.60 లక్షలు నష్టం..
నవంబర్ 8 పెద్దనోట్ల రద్దు ప్రకటన అనంతరం తొలిరోజు టిఎస్ ఆర్టీసీ కోటిరూపాయలు నష్టాన్ని చవిచూడగా.. నాటి నుండి నేటి వరకూ ప్రతిరోజూ 60 లక్షల రూపాయల నష్టాన్ని నమోదుచేస్తూ వస్తోంది. ప్రయాణికులు చిల్లరదొరక్క తమతమ టూర్లను వాయిదా వేసుకుంటుండగా సుమారు ఈ 16 రోజుల్లోనే 1300 కోట్ల రూపాయలకు పైగా...నష్టాల్ని చవిచూసింది. మరికొంతకాలం ఇదే ఆర్థిక అస్థిరత ఉంటున్న నేపధ్యంలో పెద్దనోట్ల రద్దు వ్యవహారం టిఎస్ ఆర్టీసీకి కోలుకోలేని నష్టం తప్పదని అధికారులు వాపోతున్నారు.

ఏపీఎస్ ఆర్టీసీకి ఇదే పరిస్ధితి..
మరోవైపు ఏపీలోకూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. జర్నీకి కావాల్సిన చిల్లర దొరక్క జనం తప్పసరి అయితేనే ప్రయాణీస్తున్నారు. దీంతో ఏపీలో కూడా అక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది. ఫలితంగా ఏపీఎస్ఆర్టీసీ సైతం నష్టాలను చవిచూస్తొంది... ప్రయాణీకుల చిల్లర సమస్యలను తొలగించి అక్యుపెన్సీని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచిస్తోంది. నగదుతో నిమిత్తం లేకుండా ప్రయాణాలు జరిపేందుకు ఈ పాస్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఫలితంగా ప్రయాణీకులు తమ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల సహాయంతో టిక్కెట్ పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి బస్టాండ్లు, లాంగ్ రూట్ బస్సులలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తున్నా భవిష్యత్తులో అన్నీ బస్సుల్లో...నగదు రహిత టిక్కెట్ పొందే విధానాన్ని అమలు పరిచేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తొంది. సాధారణంగా నవంబర్ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో... ఆర్టీసీలో రద్దీ అధికంగా ఉంటుంది. కాకపొతే.. పెద్దనోట్లు రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ సంస్ధలు భారీగా నష్టపోతున్నాయి. మరో నెలరోజుల పాటు ఇదే రకమైన వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుండటంతో... ఈ తరహా నష్టాలు భారీగా పెరిగే అవకాశం ఉందనీ అధికారులు అంచానా వేస్తున్నారు.

Don't Miss