సంక్షోభంలో సాగు..

16:08 - January 10, 2017

నిజామాబాద్ : అన్నదాతపై ప్రకృతి కరుణించినా...పరిస్థితులు మాత్రం సహకరించడం లేదు. దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం..వ్యవసాయాన్ని కుదిపేసింది. ఓవైపు బ్యాంకుల నుంచి రుణాలు అందక..ఉన్న సంపాదనతో వ్యవసాయాన్ని కొనసాగించలేక..నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని పంటల సాగు గణనీయంగా పడిపోయింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు రైతులకు వెసులుబాటు కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.

వ్యవసాయ రంగంపై నోట్ల రద్దు ప్రభావం
వ్యవసాయానికి ప్రకృతి కరుణించినా.. పరిస్థితులు మాత్రం సహకరించడం లేదు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు ప్రభావం కూడా వ్యవసాయ రంగాన్ని మరింత కుదేలు చేసింది. గతంతో పోల్చుకుంటే పంటసాగు తీవ్రస్థాయిలో తగ్గిపోయింది. బ్యాంకుల సాయం ఉంటేనే..వ్యవసాయం సరిగా సాగని పరిస్థితుల్లో...అసలు పెట్టుబడి పెట్టేందుకు చేతిలో చిల్లిగవ్వకూడా లేకపోతే పరిస్థితి ఇంతకెంత దారుణంగా ఉంటుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఏడాది సాగయ్యే వ్యవసాయం 51,923 హెక్టార్లు
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వ్యవసాయంపై నోట్ల రద్దు ప్రభావం పడింది. ప్రతి ఏడాది 51 వేల 923 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యవసాయం సాగయ్యేది. ఈ ఏడాది మాత్రం కేవలం 18వేల 306 హెక్టార్లకు మాత్రమే వ్యవసాయ సాగు పరిమితమైంది. వరితోపాటు జవార్ బజ్రా, మొక్కజొన్న 14వేల 722 హెక్టార్లలో సాగవుతుందని అంచనా వేయగా...ఇప్పటి వరకు 6 వేల 397 హెక్టార్లలో మాత్రమే సాగైంది. అసలే నష్టాల్లో ఉన్న తమకు నోట్ల రద్దుతో తీవ్ర నష్టం కలిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నోట్ల రద్దుతో రైతులకు అందని రుణాలు
నోట్ల రద్దు ప్రభావంతో బ్యాంకు రుణాలు సైతం రైతులకు అందకుండాపోయాయి. నిజామాబాద్ జిల్లాలో రైతులకు 654 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినటప్పటికీ... ఇప్పటి వరకు 220 కోట్ల రూపాయలు మాత్రమే రుణాలుగా ఇచ్చారు. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 28వేల 352 మంది రైతులకు రుణాలు అందించారు. కామారెడ్డి జిల్లాలో 470 కోట్ల రూపాయల రుణాలివ్వాలని నిర్ణయించగా..ఇప్పటి వరకు కేవలం 173 కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చారు. రుణాలపై బ్యాంకు అధికారులను సంప్రదించినా రైతులకు నిరాశే ఎదురవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అసలే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని సూచిస్తున్నారు. 

Don't Miss