నోట్ల రద్దుతో సామాన్యులకు ఇబ్బందులు

15:53 - December 25, 2016

నల్లగొండ : పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతి నిర్మూలన ఏమోగానీ రైతులు, కార్మికులు, ఉద్యోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న, సన్నకారు రైతులే కాదు. మధ్య తరగతి రైతులు, వాణిజ్య పంటలు సాగు చేస్తున్న వారు కూడా నోట్ల రద్దుతో తీవ్రంగా నష్టపోతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి వాణిజ్య పంటలు సాగు చేసి తీరా కాపు అందే సమయానికి కేంద్రం ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. 
జీవితాలు చిన్నాభిన్నం 
నల్లధనం వెలికి తీసేందుకు అంటూ కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేయడంతో ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఉద్యోగులు, కార్మికులు, రైతులు, కూలీలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు బ్యాంకులో ఉన్న డబ్బుల కోసమో.. ఇంట్లో ఉన్న కాస్తో కూస్తో నగదు మార్పిడికో.. నానాయాతన పడుతున్నారు. దీంతో వేలాది మంది ఉపాధి కొల్పొయి రోడ్డున పడ్డారు. 
వ్యవసాయ రంగంపై నోట్ల రద్దు ప్రభావం
ఇతర రంగాలు ఎలా ఉన్నా.. వ్యవసాయ రంగంపై నోట్ల రద్దు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. యాసంగీ సిజన్ ప్రారంభమవుతుండడంతో సాగుకోసం ఏర్పాట్లు చేసుకుంటున్న అన్నదాతలు చేతిలో నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలకు చెల్లించడానికి, పెట్టుబడుల కోసం, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రోజుకు అరకొర నగదు మాత్రమే ఇస్తుండడంతో పనులు మానుకొని రోజుల తరబడి బ్యాంకుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. అయితే చిన్న, సన్నకారు రైతులు మాత్రమే కాదు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వాణిజ్య పంటలు సాగుచేస్తున్న ఆసామీ రైతులు కూడా నోట్ల రద్దుతో తీవ్రంగా నష్టపోతున్నారు.
పడిపోయిన తోటల సాగు
నల్లగొండ జిల్లా తిప్పర్తి సమీపంలో తోటల సాగు పడిపోయింది. రెండేళ్ల నుంచి అక్కడి రైతులు దానిమ్మ తోటలు సాగుచేస్తున్నారు. సరిగ్గా నవంబర్ చివరలో తోట కాపుకు వచ్చింది. తొలి సారే కాపు ఏపుగా ఉండడంతో పాటు.. కాయలు లావుగా రావడంతో తమ కష్టార్జితం అంతా తీరినట్టేనని ఆసామీలు భావించారు. కానీ నోట్ల రద్దు వారి ఆశలను అడియాసలు చేసింది.
కొనుగోళ్లు నిలిపివేత..  
నోట్ల రద్దు ప్రకటన తర్వాత వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారని.. దీంతో నెలపాటు కాయలను కోయకుండా ఆపాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు, చెన్నయ్ లాంటి ప్రాంతాల్లోని అన్నీ మార్కెట్లను సంప్రదించామని.. కానీ ఎక్కడా వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రాలేదన్నారు. నెలపాటు కూలీలకు అదనంగా వేతనాలు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. మరో వైపు నెలరోజుల తర్వాత ధర తగ్గిపోయిందని.. దీంతో రెండువైపులా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బుల కోసం రోజల తరబడి క్యూ లైన్లలో 
ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటనతో చిన్న, సన్నకారు రైతులు బ్యాంకుల వద్ద కూలీలకు చెల్లించే డబ్బుల కోసం రోజల తరబడి క్యూ లైన్లలో నిలబడుతుండగా.. వాణిజ్య పంటలు వేసుకున్న ఆసామీ రైతులు దిగుబడి ఉన్నా.. కొనుగోలు దారులు రాక నష్టపోతున్నారు. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లుగా.. వాణిజ్య పంటలతో లక్షలు పెట్టుబడి పెట్టిన రైతులు నోట్లరద్దుతో లక్షల్లోనే నష్టపోతున్నారు.

 

Don't Miss