''డిప్రెషన్ లెట్స్ టాక్''..

16:54 - May 7, 2018

భారతదేశంలోని యువతీ, యువకులలో అధికశాతం మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచ యువ జనాభాలో ఎక్కువ శాతం భారత్ లోనే వున్నారని ప్రపంచ నివేదిక పేర్కొంది. యువత ఎక్కువగా మానసిక సమస్యలతో నిరాశ, నిస్పృహ, ఒత్తిడికి లోనై కుంగి కృషించి పోతున్నారని తెలిపింది. ప్రపంచ జనాభాలో 32 కోట్ల మంది యంగస్టర్స్ మానసిక ఒత్తిడికి లోనవుతుండగా.. వాళ్లలో 5 కోట్ల మంది భారతీయులు ఉన్నారంటే.. యువత ఎంతలా ఆందోళనకు లోనవుతున్నారో ఊహించుకోవచ్చు..అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ-2015 నివేదికలో ఈ విషయాలను ప్రచురించింది డబ్ల్యుహెచ్వో సంస్థ.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఒత్తిడి..
ఆత్మహత్యల్లో ఎక్కువ శాతం భారత వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే జరుగుతున్నాయని వెల్లడించింది. వీళ్లలో ఎక్కువ మంది ఆగ్నేయాసియా, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంత దేశాలవారేనని తెలియజేసింది. ప్రపంచ యువకులలో చోటు చేసుకుంటున్న మానసి రుగ్మతలను 2005 నుంచి 2015 వరకు డబ్ల్యుహెచ్వో అధ్యయనం చేయగా ఆసక్తికర సంఘటనలు బయటపడ్డాయి.

యువతలో 18.4 శాతం పెరిగిన మానసిక రుగ్మతలు..
యువకుల్లో మానసిక రుగ్మతలు 18.4 శాతం పెరిగాయని వెల్లడించింది. దేశ జనాభా అంటే 2015లో 4.5 శాతం కుంగుబాటుకు లోనవగా… 3 శాతం మంది ఆందోళనకు గురయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

ఒత్తిడితో 7.8 శాతం మంది ఆత్మహత్యలు..
దేశంలో ప్రతి పది మందిలో ఒకరు మానసిక సమస్యలతో చిధ్రమవుతున్నారంది వాల్డ్ నివేదిక. ఈ ఏడాది ఒత్తిడి వల్ల 7.8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపింది. ఆత్మహత్య చేసుకున్నవాళ్లలో పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా ఉన్నారని తెలియజేసింది.

ఏప్రిల్ 7.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం...
ఏప్రిల్ 7.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.డిప్రెషన్ లెట్స్ టాక్”ను 2017 సంవత్సరం నినాదంగా ప్రకటించింది డబ్ల్యుహెచ్వో. కుంగిపోతున్న యువతను… చైతన్యవంతం చేసే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చింది. నిరాశ, నిస్పృహలను తరిమేయాలని… ఆశావాదంతో డిప్రెషన్ నుంచి బయటపడాలని చెబుతున్నారు వైద్యులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 300 మిలియన్ల మంది డిప్రెషన్ తో బాధ పడుతున్నారు. అందుకే ఈ ఏడాదిని ”డిప్రెషన్ లెట్స్ టాక్” గా నిర్వహించాలని నిర్ణయించింది.

మారుతున్న జీవనపరిస్థితులే కారణంగా..
నవ్వుతూ పలకరించు.. ప్రేమగా మాట్లాడు.. ఆత్మీయతను పంచు.. డిప్రెషన్ తో బాధపడేవారికి ఇదే మందు అంటున్నారు డాక్టర్లు. మారుతున్న జీవన పరిస్థితుల్లో పక్కవాళ్లతో ప్రేమగా మాట్లాడటం కూడా ఆరోగ్య సందేశంగా మారిపోయింది. ఈ సందేశాన్ని మరింత విస్తృత పరచాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తన సైకత శిల్పం ద్వారా ఇదే పని చేస్తున్నారు.. తరణి ప్రసాద్ మిశ్రా. ఏపీ శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదీతీరంలో ఈ సైకతశిల్పి చెక్కిన శిల్పం ద్వారా.. ఈ సందేశాన్నే వినిపిస్తున్నారు.

ఆత్మవిశ్వాసంతోనే గెలుపు..
ఏది ఏమైనా ఆత్మవిశ్వాసం అనేది మనిషిని బతికిస్తుంది. గెలిపిస్తుంది. పోరాడేపటిమను అలవరిస్తుంది. అందుకే మేధావులు, అనుభవజ్నులు చెప్పిన మాటలను వల్లె వేసుకుందాం. ఒత్తిడిని జయిద్దాం..ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుందాం..ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని, చైతన్యాన్ని వెలికి తీస్తుంది. మీరు దేనినైనా సాధించగలరు. ఒక వ్యక్తి గానీ, జాతి గానీ తనపై తాను విశ్వాసాన్ని కోల్పోతే అది మృత్యువుతో సమానం.

Don't Miss