ధర్మపురి...ఈవోపై పలు ఆరోపణలు...

10:37 - September 30, 2018

జగిత్యాల : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి..నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఐతే ఆ ఆలయంలో గాజులు  మాయమయ్యాయి. గాజులంటే అవి మామూలు గాజులు కాదు. వజ్రాలతో పొదిగిన గాజులు. ఎన్‌ఆర్‌ఐ  దంపతులు దేవునికి కానుకగా సమర్పించిన గాజులను గాయబ్‌ చేసిందెవరు..? ఇంత జరుగుతున్నా అధికారులు  చూస్తూ ఊరుకున్నారెందుకు..? ఆలయ పాలకమండలి ఏం చేస్తోంది..?

యోగ, ఉగ్ర నృసింహ అవతారాల్లో కనిపించే స్వామితో పాటు.. హరిహర క్షేత్రంగా.. త్రిమూర్తులు కొలువైన పవిత్ర  ప్రదేశంగా.. జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రసిద్ధిగాంచింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటి గోదావరి  పుష్కరాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. విదేశాల్లో ఉంటున్న ధర్మపురి వాస్తవ్యులైన కుప్పం విజయలక్ష్మి, సుబ్రహ్మణ్యం... గుప్తదానం కింద సుమారు ఆరులక్షల పైచిలుకు విలువ చేసే డైమండ్ గాజులను.. ఈమధ్య లక్ష్మీనృసింహుడి హుండీలో వేయబోయారట. విషయం తెలుసుకున్న ఈవో సుప్రియ హుండీలో వేస్తే  ఎండోమెంటుకు వెళ్లిపోతుంది.. నాకివ్వండీ నేను ఈ ఆలయ అభివృద్ధి కోసం ఉపయోగిస్తానంటూ.. ఆమెవద్ద నుంచి  తీసుకున్నారట. ఇప్పుడా గాజులేమైనాయంటే.. అర్థంపర్థంలేని కారణాలు చూపిస్తున్నారని బాధితపక్షంతో పాటు..  ఊళ్లో జనం సీరియస్ అవుతున్నారు.

గాజులు కనిపించకపోవడంతో స్థానికులతో పాటు ఆలయ సిబ్బంది ఈవోపై నిరసన గళం విప్పారు. ఐతే ఈవో సుప్రియ వరంగల్ కు బదిలీ  అవడంతో అందరి ఆరోపణలకు మరింత బలం చేకూరినట్టైంది.  డైమండ్స్ తో కూడిన  బంగారు గాజులను ఈవో నొక్కేసిందని ఆమె పై స్థాయిలో అధికారులు రక్షిస్తున్నారంటూ పలువురు ఆరోపించారు.  ఈవో పై చర్యలు తీసుకోవాలంటు ఇటీవలే బిజెపి పార్టీ ధర్మపురి బంద్ పిలుపు  నివ్వగా...బ్యాంకులు.విద్యసంస్థలతోపాటు స్థానికులంతా బంద్ సంఘీభావం తెలిపి బంద్ లో పాల్గొన్నారు.  ఆలయంలో డైమండ్‌ గాజులు మాయం అవడంతో.. భక్తులిచ్చిన గుప్తనిధుల ఉన్నాయో లేవో విచారించాలని   బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

ఆలయ ఉద్యోగులను తన కనుసైగలతో నడిపిస్తూ.. అడ్డగోలు అవినీతికి ఇక్కడి ఈవో తెరతీస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సుప్రియకు నియోజకవర్గ స్థాయి ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండటంతో.. ఇక్కడి పాలకవర్గం కూడా చేతకాకుండా చేష్టలుడిగి చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  గతంలో ఈవో సుప్రియ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు నాల్గుతులాల బంగారు గొలుసును లక్షీనృసింహుడి సాక్షిగా  ఆలయంలోనే కానుకగా ఇవ్వడం వివాదాస్పదమైంది.  ఆలయంలో జరుగుతున్న అక్రమాల పై సమగ్ర విచారణ జరిపిస్తే అసలు విషయం బయటపడుతుందంటున్నారు  భక్తులు, లేదంటే ఆలయ ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉందని భక్తులు చెబుతున్నారు.

Don't Miss