శిథిలావస్థలో కోటగల్లి బడి...

15:00 - July 12, 2018

నిజామాబాద్ : అదో సర్కారు బడి. దశాబ్దాల చరిత్ర ఆ బాలికల పాఠశాల సొంతం. అక్కడ సీటు దొరకడమే కష్టం. కానీ పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది ఆ పాఠశాల పరిస్థితి. పైకప్పు రేకులు, గోడలు ఎప్పుడు కూలుతాయో తెలియదు. పాఠశాల ప్రాంగణం బురద గుంతను తలపిస్తుంది.నిజామాబాద్ నగర నడిబొడ్డున ఉన్న కోటగల్లి బడికి వెళ్ళాలంటేనే విద్యార్థినిలు హడలిపోతున్నారు. -

నిజామాబాద్ నగర నడిబొడ్డున ఉన్న కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల. 1969లో రేకుల షెడ్డులో ప్రారంభమైన ఈ బడిలో ఆరు నుంచి పదో తరగతి వరకూ విద్యా బోధన ఉంది. ఇక్కడ చేరేందుకు అమ్మాయిలు క్యూ కడతారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఇక్కడ ప్రవేశాలు జరుగుతాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ స్కూల్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. పగిలిన రేకులు, ఎప్పుడు కూలుతాయో తెలియని గోడల మధ్యన బిక్కు బిక్కుమంటూ చదువు సాగిస్తున్నారు. వర్షం కురిసినా, ఎండలు మండినా ఈ బడికి సెలవే

420 మందికి పైగా చదువుతున్న ఈ బడి ఎప్పుడు కూలుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొంది. ఇటీవల రేకులు విరిగిపడటంతో కొందరు గాయపడ్డారని ఉపాధ్యాయులు తెలిపారు. సరైన మరుగు దొడ్లు, తాగునీటి సౌకర్యం లేదంటున్నారు విద్యార్థినీలు. భయంతో చదువుపై శ్రద్ధ పెట్టలేకున్నామంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై పాలకుల మాటలు నీటిమూటలను తలపిస్తున్నాయి. జిల్లాలో 130 పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నట్లు రికార్డులే చాటుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్కార్‌ బడుల్లో సౌకర్యాలు మెరుగు పరచాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Don't Miss