బహుముఖ ప్రజ్ఞాశాలి..ప్రముఖ సినీ నిర్మాత రాఘవ మృతి ..

06:53 - July 31, 2018

హైదరాబాద్ :, బహుముఖ ప్రజ్ఞాశాలి..రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత...ప్రముఖ సినీ నిర్మాత కె. రాఘవ కన్నుమూశారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ సోమవారం రాత్రి ఫిలింనగర్ లోని ఆయన నివాసంలో 104 సంవత్సరాల వయస్సులో రాఘవ గుండెపోటుతో కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లాలోని కోటిపల్లిలో జన్మించిన రాఘవ సినీ రంగానికి ఎనలేని సేవలు చేశారు. 15 సంవత్సరాల వయసులో ఇంటినుండి పారిపోయిన రాఘవ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని మూకీ చిత్రాలనుండి పెనవేసుకున్న ఆయన సినిమా చరిత్ర నిర్మాతస్థాయికి ఎదిగి టాలీవుడ్ లో ఎంతోమంది ప్రతిభావంతుల్ని రాఘవ సినీ రంగానికి పరిచయం చేశారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేతగా సుఖదుఃఖాలుసినిమాకు సహ నిర్మాతగా..జగత్ కిలాడీలు,జగత్ జెట్టీలు,జగత్ జెంత్రీలు,తాత మనవడు,సంసారం-సాగరం,తూర్పు పడమర,ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,తరంగిణి,సూర్యచంద్రులు,చదువు సంస్కారం,అంతులేని వింతకథ,త్రివేణి సంగమం,ఈ ప్రశ్నకు బదులేది,యుగకర్తలు సినిమాలను నిర్మించారు. నటుడిగా మారిన రాఘవ బాలనాగమ్మ, చంద్రలేఖ సినిమాలలో నటించారు. స్టంట్ మాస్టర్‌గా తన మార్కుతో పల్నాటి యుద్ధం,పాతాళ భైరవి,రాజు పేద సినిమాలకు పనిచేశారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా కూడా పనిచేసిన ఆయన కీలుగుర్రం, టార్జాన్ గోస్ ఇండియా -అంనే ఇంగ్లీస్ సినమాకు పనిచేశారు. వీరపాండ్య కట్టబొమ్మన్ అనే తమిళచిత్రం,భలే పాండ్య,అంతేకాదు హిందీ చిత్రం దిల్ తేరా దీవానా సినిమాకు పనిచేశారు. దర్శకరత్న దాసరి నారాయణ రావును తాతమనవడు సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో కోడి రామకృష్ణకు దర్శకుడిగా అవకాశమిచ్చారు. సినీ పరిశ్రమకు దర్శక దిగ్గజాలను పరిచయం చేశారు కె.రాఘవ. గొల్లపూడి, భానుచందర్, మాధవి వంటి నటీనటులను పరిచయం చేశారు. అంచెలంచెలుగా సినిమా పరిశ్రమలో ఎదిగిన కె.రాఘవ పాండిచ్చేరికి చెందిన నిర్మాత ఎం.కె.రాధా చెల్లెలు హంసారాణిని వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు ప్రతాప్, కూతురు ప్రశాంతి ఉన్నారు.

 

 

Don't Miss