బయటపడుతున్న గులాబీ నేతల అవినీతి

08:40 - September 27, 2017

హైదరాబాద్ : అధికారపార్టీనేతలు, ప్రజాప్రతినిధుల అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. మీడియా సాక్షిగా నేతల అసలు రూపం జనం ముందుకు వస్తోంది. లీడర్లు ఆదర్శవంతంగా ఉండాలన్న ముఖ్యమంత్రి హితవులును బూడిదలోపోసిన పన్నీరు చందంగా మారుతున్నాయి. శాసనసభా పక్ష సమావేశాలు జరిగిన ప్రతిసారి సిఎం కెసిఆర్ నైతికపాఠాలతో దిశా నిర్దేశం చేస్తున్నా .. నేతల అవినీతి బాగోతాలు బయటపడుతూనే ఉన్నాయి. అధికారులు- అధికారపార్టీ ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం ఎప్పటికప్పుడు బయటపడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యవహారం మరువక ముందే ..తాజాగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ కబ్జాల బాగోతం బయటపడింది.

ఎమ్మెల్యే భూ కబ్జా
ఎమ్మెల్యే భూ కబ్జా బాగోతాన్ని మీడియాసాక్షిగా కలెక్టర్‌ దేవసేన బయటపెట్టారు. పైగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కబ్జాల వ్యవహారం ఉప ముఖ్యమంత్రికి కూడా తెలుసని కలెక్టర్‌ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ప్రజాప్రతినిధుల బండారాన్ని అధికారులే బయటపెడితే.... పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఘటనే అద్దం పడుతోంది. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం దూమారం రేపే అవకాశం కనిపిస్తోంది. కాగా దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలా స్పందిస్తారో అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. 

Don't Miss