నాసిరకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ

13:06 - September 13, 2017

గుంటూరు : అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు చేపడుతున్న షాపూర్జీ పల్లోంజి కంపెనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యుజిడి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వెయ్యి కిలోమీటర్ల మేర అండర్‌ గ్రౌండ్‌ పైపు లైన్లు వేస్తుండటంతో.. దీర్ఘకాలం మన్నేలా పనులు చేపట్టాల్సి ఉంది. ముఖ్యమైన కూడళ్ల వద్ద ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పైపులైన్ల సైజుల్లోనూ నిబంధనలు పాటించడం లేదన్నది మరో ఆరోపణ. పనులు తొందరగా పూర్తి చేయాలన్న ధ్యాస తప్ప.. నాణ్యత గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్వారీ డస్ట్‌తో పనులు పూర్తి
పైపులైన్‌ వేసే ముందు 4 అంగుళాల మేర ఇసుక వేయాలి. పైపు లైన్‌ వేసిన తర్వాత కూడా 6 అగుంళాల మేర ఇసుక వేయడం తప్పనిసరి. అయితే ఇసుక వేయకుండా క్వారీ డస్ట్‌తో పనులు పూర్తి చేస్తున్నారు. గుంటూరు నగరంలో నల్లరేగడి భూములు ఉండటంతో..పైపులైను గుంతలను సరిగా పూడ్చకపోతే భూమిలో పగుళ్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. దాంతో పైపులైన్లు పగిలే పోయే అవకాశం ఉందంటున్నారు. వెయ్యి కోట్లతో చేపట్టిన పనులను ప్రజారోగ్య శాఖ పర్యవేక్షిస్తోంది. ఈ శాఖలో సిబ్బంది తగినంతగా లేరు. దీంతో పనుల నాణ్యతపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జేఎన్ఎన్ యూఆర్ఎంపథకం
నాసిరకంగా చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల్లో అక్రమాలు కలకలం రేపుతున్నాయి. జేఎన్ఎన్ యూఆర్ఎంపథకం మార్గదర్శకాలను అనుసరించి ఏపీ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌...డీపీఆర్‌ తయారీకి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థను ఆదేశించింది. దీంతో జూన్‌ 28, 2012న తీర్మానం చేసి ఎలాంటి టెండర్లు ఆహ్వానించకుండా హైదరాబాద్‌కు చెందిన ఓ సలహా సంస్థకు డీపీఆర్‌ బాధ్యతలు కట్టబెట్టింది. అసలు ఇక్కడే అక్రమాలకు బీజం పడింది. డిపిఆర్ తయారీకి రెండు సంత్సరాలు గడువు తీసుకుంది. కమిషనర్‌ స్థాయిలో ఎస్‌ఈతో చర్చించి అందులో ఏం నిర్ణయాలు తీసుకున్నారో నమోదు చేయకుండా సలహా సంస్థ కోరిన విధంగా బిల్లులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ప్రాజెక్టు విలువ 903.81 కోట్లపై 0.75 శాతం చొప్పున కన్సల్టెన్సీ రుసుములు చెల్లించటానికి సెప్టెంబర్‌ 27, 2016న ప్రభుత్వం జీవో నంబరు 233 జారీ చేసింది. డీపీఆర్‌ తయారీకి 50 లక్షల నుంచి కోటి రూపాయలు చెల్లించాల్సింది పోయి ఏకంగా.. 7.69 కోట్లు చెల్లించారు. ఈ ఏడాది మార్చిలో నగరపాలక సంస్థ ఈ చెల్లింపులు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

Don't Miss