'రజనీ' పార్టీ గుర్తు ఇదేనా ?

10:17 - May 18, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా..ఇంతా కాదు. ఆయన దేశ..విదేశాల్లో సైతం ఆయనకు విశేషమైన అభిమానులున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఆయనకు ఎంతో మంది వీరాభిమానులున్నారు. తాజాగా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు సోషల్ మాధ్యమాల్ల చక్కర్లు కొడుతున్నాయి. జయలలిత మరణం తరువాత ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'రజనీ' రాజకీయాల్లోకి రావాలని తీవ్ర వత్తిడి వస్తోంది. దీనితో 'రజనీ' కొన్ని సంవత్సరాల తరువాత అభిమానులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ ఫంక్షన్ హాల్ లో అభిమానులతో ఆయన మాట్లాడారు. ‘దేవుడు ఏది శాసిస్తే అదే చేస్తాను' అంటూ ఆయన పేర్కొన్నారు. అభిమానులు నిజాయితీగా ఉండాలని, రాజకీయాల్లోకి రావాలని దేవుడు ఆదేశిస్తే వస్తానని స్పష్టం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అభిమానులతో సమావేశమైన సందర్భంలో ఒక పువ్వుపై బాబా గుర్తు ఫొటో ఉండడం గమనార్హం. రజనీ పార్టీ పెడితే ఇదే గుర్తు ఉంటుందా ? అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఈనెల 19వ తేదీన రజనీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 'రజనీ' రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ తమిళనాడు శాఖలు కోరుతున్నాయి. అయితే సొంతపార్టీ పెట్టాలని అభిమానులు 'రజనీకాంత్‌'పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రజనీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Don't Miss