జమ్మలమడుగు టీడీపీలో ఆధిపత్యపోరు

19:14 - September 3, 2017

కడప : దశాబ్దాలుగా ఫ్యాక్షన్‌...రాజకీయాలు రెండూ కలగలిసి రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారిన జమ్మల మడుగులో మళ్లీ రాజకీయాలు మొదలయ్యాయి. వైసీపి నుండి ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి చేరడంతో అక్కడి రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఆదినారాయణ రెడ్డికి మంత్రి టీడీపి పదవి కట్టబెట్టింది. ఆదికి మంత్రి పదవి ఇవ్వడం పట్ల టీడీపీ నేత రామసుబ్బారెడ్డి బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి హామీ మేరకు వెనక్కు తగ్గారు. మంత్రిగా ఆదినారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తమకు పార్టీలో అవమానాలు మొదలయ్యాయని రామసుబ్బారెడ్డి వాపోతున్నారు.

ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు
రామసుబ్బారెడ్డి వర్గం కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా ఇటీవల గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కడంతో ఇప్పుడిప్పుడే పార్టీలో పుంజుకుంటున్నారు. గతంలో జమ్మలమడుగు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా రామసుబ్బారెడ్డి తన తమ్ముడు గిరిధర్‌ రెడ్డి పేరును ప్రతిపాదించారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా తన కుమారుడు సుధీర్‌ రెడ్డిని చైర్మన్‌గా నియమించాలని పావులు కదిపారు. ఈ ప్రతిపాదనకు ఒప్పుకోని రామసుబ్బారెడ్డి తన తమ్ముడికే పదవి కట్టబెట్టాలని పట్టుబట్టారు. ఈ విషయంపై ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో అస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ ఎంపిక వాయిదా వేయాలని టీడీపీ అధిష్ఠానం సూచించింది. అధిష్ఠానం నిర్ణయంతో ఇరు వర్గాలు వెనక్కి తగ్గాయి.అయితే ఇటీవల జమ్మలమడుగులో జరిగిన సమావేశంలో ఆస్పత్రి కమిటీ చైర్మన్‌గా తన కుమారుడు సుధీర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. పట్టుబట్టి తన కుమారుడికి పదవి కట్టబెడతామని చెప్పారు. తాను అనుకున్నది జరగకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే ఆది మాటల వెనుక వ్యూహం దాగుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పదవి దక్కకపోతే రాజకీయాలను వదులుకుంటానన్న మాటలు చిన్నపాటి హెచ్చరికలా మంత్రి తెలియజేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామలతో జమ్మలమడుగులో సందిగ్ధత చోటుచేసుకుంది. ఇద్దరూ పార్టీకి మంచి నేతలవడంతో టీడీపీ అధిష్ఠానానికి ఇదో విషమ పరీక్షలా మారింది. ఈ సందిగ్ధంలో అధిష్ఠానం... పదవి ఎవరికి కట్టబెడుతుందో వేచి చూడాలి. 

Don't Miss