'డబుల్‌' కష్టాలు....

13:03 - June 13, 2018

హైదరాబాద్ : అందరూ ఆత్మగౌరవంతో బ్రతకాలి. అందుకే  డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మిస్తున్నాం. మీరున్న స్థలాలు ఖాళీ చెయండి. 14 నెలల్లో ఇళ్లు కట్టిస్తాం.. ఇది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం సమయంలో ప్రభుత్వం పెద్దలు అధికారులు చెప్పిన మాటలు. కానీ ఇళ్ల నిర్మాణ పనుల్లో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. గ్రేటర్‌ పరిధిలో స్లమ్స్‌ను తొలగించి, ఇళ్లు నిర్మిస్తామన్నా పనులు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

హైదరాబాద్‌ నగరంలో లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం చేపడుతామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఖాళీ స్థలాలతో పాటు మురికి వాడలు... బస్తీల్లో కూడా రెండు పడక గదులను నిర్మిస్తామన్నారు. అయితే మురికి వాడల్లో ఇళ్ల నిర్మాణం పెద్ద సమస్యగా మారింది. అక్కడున్న కుటుంబాలను ఒప్పించి, భూవివాదాలను చక్కబెట్టడం అధికారులకు తలనొప్పిగా మారింది. మరో వైపు లబ్ధిదారులు ఒప్పుకున్న ప్రాంతాల్లో కూడా నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో చర్చనీయాంశంగా మారింది.

ఇక కార్వాన్‌ నియోజకవర్గంలో గుడిమల్కాపూర్‌ బోజగుట్ట వద్ద ఉన్న మురికివాడలో 1800 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ స్లమ్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 14 నెలల్లో నిర్మాణ పనులు పూర్తిచేస్తామని, అప్పటి వరకు పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లో గుడిసెలు ఏర్పాటు చేసుకోవచ్చంటూ అంధికారులు సెలవిచ్చారు. దీంతో కొంతమంది అక్కడే గుడిసెలు వేసుకోగా మరి కొందరు... ఇతర ప్రాంతాల్లోకి వెళ్లారు. ఇప్పటికి 7 నెలలు గడుస్తున్నా పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పనుల్లో తీవ్రజాప్యం చేస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు.

మొత్తం 68బ్లాకుల్లో  1800 కుపైగా ఇళ్లు నిర్మించాల్సి ఉంటే 5,6 బ్లాకులకు మించి పనులు కాలేదు. టెండర్‌ అగ్రిమెంట్‌ పూర్తయ్యి 7 నెలలు అయినా.. పనుల్లో మాత్రం వేగం లేదని బోజగుట్ట వాసులు అంటున్నారు. పక్కనే చిన్న అవాసాలు ఏర్పాటు చేసుకొని  అనేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు. పనులు త్వరగా పూర్తిచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

జిహెచ్‌ఎంసీ సీటీ పరిధిలోని మురికి వాడల్లో 10వేల ఇళ్ల వరకు నిర్మిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి కోర్టు కేసులు, భూవివాదాలు వెంటాడుతున్నాయి. వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసిప్పుడు మాత్రమే ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని లేదంటే సామన్యూలకు కష్టాలు తప్పవని స్థానికులు అంటున్నారు.  

Don't Miss