అంబేద్కర్ కు ఎన్నో అవమానాలు...

06:56 - April 14, 2018

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి గుండెల్లో కొలువుదీరాడు. మనువు రాసినట్లుగా భావించే చాతుర్వర్ణ వ్యవస్ధ భారతదేశాన్ని శాసిస్తుండేది. వేదాలు ఘోషించిన కట్టుబాట్లు మంచేదో, చెడు ఏదో తెలుసుకోగల్గిన మనుషుల మధ్యే అంతరాల దొంతరలు సృష్టించాయి. వర్ణవ్యవస్ధను, మనుధర్మాలను తూచ తప్పకుండా పాటించే రోజుల్లో 1891 ఏప్రిల్‌ 14వ తేదిన మహారాష్ట్రలో రాంజీ సక్‌పాల్, భీమాబాయి దంపతుల 14వ సంతానంగా అంబేద్కర్‌ మహర్‌ కులంలో జన్మించారు. సైనిక కుటుంబంలో పుట్టినప్పటికి అంబేద్కర్‌... మహర్‌ కులానికి చెందిన వాడు కావటంతో చిన్ననాటి నుంచే ఎన్నో అవమానాలకు గురయ్యాడు. ఎంతో ప్రతిభావంతుడైనప్పటికి అంటరాని వాడనే కారణంగా ఛీత్కారాలు చవిచూశాడు.

అంబేద్కర్‌ చిన్నతనంలో ఓ సారి మండు వేసవిలో బంధువుల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. స్టేషన్‌ నుంచి కిలోమీటర్ల దూరం ఉన్న ఆయన మామయ్య ఇంటికి చేరుకోవాలంటే ఏదో వాహనం తప్పనిసరి. కాని అంబేద్కర్‌ అంటరానివాడని తెల్సిన వాళ్లెవరు బండి ఎక్కించుకునేందుకు ఒప్పుకోలేదు. చివరకు మండుటెండలో గొంతు తడారిపోతున్నా గుక్కెడు మంచినీరు కూడా ఇవ్వలేదు. ఇక చదువుకునే రోజుల్లో బహుమతులు, ప్రశంసాపత్రాలు అన్నీ అంబేద్కర్‌కే దక్కేవి. ఇదేకోవలో బహుమతి ప్రధానోత్సవానికి వచ్చిన ఓ నేత అంబేద్కర్‌కు ప్రశంసాపత్రాన్ని ఇచ్చేందుకూ ససేమిరా అన్నాడు. అంటరానితనపు కత్తి చేసిన ఇలాంటి ఎన్నో గాయాలకు కుమిలిపోయాడు.

ఎన్నో అవమానాలు దిగమింగిన అంబేద్కర్‌ కులవ్యవస్థ రక్కసి కోరలకు బలవుతూనే ఉన్నత చదువులు చదివాడు. బరోడా మహారాజు ఇచ్చిన వేతనంతో 1912లో బి.ఏ. పాసయ్యాడు. పట్టభద్రుడైనప్పటికి చదువుకోవాలనే కోరికతో కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్లాడు. 1915లో ఎం.ఏ. 1916లో పి.హెచ్.డి. డిగ్రీలను సంపాదించాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ల తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా" అనే పేరుతో ప్రచురితమైంది. 1917 లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశానికి వచ్చినా ఇక్కడి అంటరానితనపు జాడ్యం ఆయన్ను మరింతగా వేధించింది.

Don't Miss