మహిళ ఉపాధి కల్పనలో 26 వసంతాలు

11:59 - August 13, 2017

ఆర్మూర్ : ఇది నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు మండలం పెర్కిట్‌ గ్రామంలోని దుర్గాబాయి దేశ్‌ముఖ మహిళా శిశు వికాస కేంద్రం. దీన్ని 1988 మార్చిలో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభించారు. మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాంగణం పనిచేస్తోంది. ఈ మహిళా ప్రాంగణం ఏర్పాటు చేసి దాదాపు 29 సంవత్సరాలైంది. నాటి నుంచి నేటి వరకు ఇక్కడ ఎంతోమంది మహిళలు, యువతులు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ తీసుకున్నారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 36 రకాల కోర్సులను నేర్పిస్తున్నారు. ఇప్పటి వరకు 6,183 మంది మహిళలు ఇక్కడ శిక్షణ పొందారు. వీరిలో 4541 మంది వివిధ రంగాలలో స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, తల్లిదండ్రులు లేని అనాథ యువతులకు ఇక్కడ వృత్తివిద్యా కోర్సుల్లో ట్రైనింగ్‌ ఇస్తారు. శిక్షణ పూర్తైన తర్వాత వారికి వివిధ కంపెనీల్లో ఇతర సంస్థల్లో ఉపాధి కల్పిస్తారు. కంప్యూటర్‌ కోర్సులతోపాటు అల్లికలు, కుట్టు శిక్షణ, బ్యూటీషియన్‌, ఎంబ్రాయిడరీ వర్క్‌, స్క్రీన్‌ ప్రింటింగ్‌, స్టేషనరీ, బుక్‌ బైండింగ్‌లాని ఎన్నో వృత్తివిద్యా కోర్సులు ఇక్కడ నేర్పిస్తున్నారు.

పూర్తిస్థాయిలో కొనసాగని శిక్షణ
ఈ మహిళా శిక్షణ కేంద్రానికి ... రాష్ర్ట మహిళా సహకార అభివృద్ధి సంస్థ, ఎస్సీ, మైనారిటీ, బీసీ కార్పొరేషన్లతోపాటు ఉమెన్స్ వెల్ఫేర్‌, జిల్లా పరిషత్ లు కేటాయించిన నిధులతో ట్రైనింగ్‌ జరుగుతోంది. అయితే సంవత్సరకాలంగా నిధుల కేటాయింపు తగ్గింది. దీంతో మహిళలకు పూర్తిస్థాయిలో శిక్షణ కొనసాగటం లేదు. ఎంతోమంది పేదింటి మహిళల జీవితాల్లో వెలుగులు పూయిస్తున్న ఈ శిక్షణా కేంద్రానికి మరిన్ని నిధులు కేటాయించాలని ఇక్కడ పనిచేసే సిబ్బంది కోరుతున్నారు. మహిళా ప్రాంగణంలో మొత్తంగా 36 కోర్సులు ఉండగా... ట్రైనింగ్‌ ఇచ్చే వారు మాత్రం 15 మంది మాత్రమే ఉన్నారు. సిబ్బందిని కూడా పెంచాలని పలువురు కోరుతున్నారు. నిధులు కూడా సక్రమంగా విడుదల చేస్తూ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు.

Don't Miss