'ఈ'ఆసుపత్రి..

19:09 - December 14, 2016

నిజామాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఖరీదైన వైద్యాన్ని, ఉచితంగా నాణ్యంగా అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది. ఉస్మానియా, గాంధీ తరహాలో అన్ని రకాల వైద్యసేవలు పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు నిజామాబాద్‌ జిల్లా దవాఖానకు ఈ ఆస్పత్రి హోదా కల్పించింది. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందిస్తూనే డాక్టర్లు విధుల్లో అలసత్వం వహించకుండా నిరంతర పర్యవేక్షణతో చెక్‌ పెట్టేందుకు ప్లాన్‌ చేస్తోంది.

ఈ ఆసుపత్రిగా జిల్లా ఆసుపత్రి
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంద ఆసుపత్రిగా ఉన్న జిల్లా ఆసుపత్రిని ఈ ఆసుపత్రిగా మార్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు. ఈ- ఆస్పత్రి విధానం అమలులోకి రావడంతో జిల్లా దవాఖాన తీరు మారనుంది. హైదరాబాద్ కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా జిల్లా ఆస్పత్రి మారుతుంది. సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే జిల్లా దవాఖానకు అధునాతన భవన సముదాయంతో పాటు నిష్ణాతులైన వైద్యులు పూర్తిస్థాయిలో ఉన్నారు.

నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రికి ఈ ఆస్పత్రి హోదా
ఈ ఆస్పత్రి విధానంతో అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తారు. ఒక్కసారి రోగి పేరు ఇతర వివరాలు రిజిస్ర్టేషన్ చేసుకున్న తర్వాత అన్ని విభాగాలు ఆ సమాచారాన్ని వీక్షించే వీలుంటుంది. జిల్లా ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తీరును సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు హైదరాబాద్ నుంచే వీక్షించే సదుపాయం ఉంటుంది. ఈ ఆసుపత్రి సేవల్లో మొదటి దశలో భాగంగా ఇన్ పేషంట్‌, ఔట్‌ పేషంట్‌ విభాగాలతో ప్రారంబించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసారు. రోగి కేష్‌ షీట్‌ వివరాలు, వైద్యులు రాసిచ్చిన మందులు, రోగికి చేయాల్సిన పరీక్షలు తదితర వివరాలు నమోదు చేస్తారు.

రోగి వివరాలు ఒకసారి నమోదు చేస్తే చాలు..అన్ని విభాగాలకు రోగి వివరాలు
తెలంగాణలో ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఈఎన్టీ ఆసుపత్రి, సరోజిని దేవి ఆసుపత్రి, కింగ్ కోఠి ఆసుపత్రి, వరంగల్ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ హాస్పటల్‌ సేవలు అందుతున్నాయి. ఈ జాబితాలోకి కొత్తగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి చేరింది. ఈ విధానం అమలు చేయటం వలన పారదర్శకతతో పాటు ఆస్పత్రుల్లో జరిగే అక్రమాలకు చెక్‌పెట్టొచ్చని వైద్యాధికారులు భావిస్తున్నారు.

ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఈఎన్టీ, సరోజిని దేవి ఆసుపత్రి
ఇకపై సీరియస్ కేసులను హైదరాబాద్ తరలించే అవసరం లేకుండా జిల్లా కేంద్రంలోనే వైద్య సేవలు అందించే వీలుంటుంది. నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రిని ఈ ఆస్పత్రిగా మార్చడం పట్ల జిల్లావాసులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. 

Don't Miss