ఏఈవోపై పోలీస్ కేసు పెట్టిన ఈవో కోటేశ్వరమ్మ

09:25 - November 8, 2018

విజయవాడ  : కనక దుర్గమ్మ ఆలయంలో అవినీతికి పాల్పడిన సిబ్బందిపై ఈవో చర్యలు తీసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. మెమొంటోల విషయంలో సిబ్బంది చేతివాటానికి పాల్పడిన్టు తేలడంతో  ముగ్గరు ఉద్యోగులతోపాటు ఒక కాంట్రాక్ట్‌ ఉద్యోగిని విధుల నుంచి తొలగించడం సంచలనం రేపుతోంది.  సస్పెండ్ అయిన ఏఈవో అచ్యుతరామయ్య తనను బెదిరించారంటూ ఈవో కోటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి దుర్గగుడిలోని వివాదం తెరపైకి వచ్చింది.

Related imageమెమొంటోల్లో సిబ్బంది చేతివాటం  దుర్గగుడి ఈవో, ఏఈవోకు మధ్య తీవ్ర వివాదాన్ని సృష్టించింది. దసరా ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ మెమొంటోలు ఇవ్వాలని ఈవో ఆదేశించారు.  ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులందరికీ మెమొంటోలు ఇచ్చామంటూ సిబ్బంది రెండువేల మెమొంటోలకు  బిల్లు చేశారు. చాలా మంది భక్తులు తమకు జ్ఞాపికలు అందలేదంటూ ఈవోను కలవడంతో ఆమె విచారణ చేపట్టారు. మెమొంటోల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్టు ఈవో విచారణలో వెల్లడైంది. కాంట్రాక్ట్ ఉద్యోగి సైదా మెమొంటోలు అందజేయడంతో అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించి అతనని విధుల నుంచి తొలగించారు. సైదాకు సహకారం అందించారంటూ రికార్డ్‌ అసిస్టెంట్‌ సునీతను, సీనియర్‌ అసిస్టెంట్‌ గోపిచంద్‌ను సస్పెండ్‌ చేశారు. ఎంక్వైరీ ఆఫీసర్‌గా ఉన్న ఏఈవో అచ్యుతరామయ్య తన విధులను సరిగా నిర్వహించలేదని, నిజానిజాలు వెలుగుచూపేలా విచారణ చేయకుండా... అక్రమాలకు పాల్పడిన వారికి మద్దతు పలకడాన్ని తప్పుపడుతూ అతడిని సస్పెండ్‌ చేశారు. దీంతో ఈవో, ఏఈవో మధ్య వివాదం రాజుకుంది.
తానేంటో ఈవోకు చూపిస్తానని సవాల్‌                    
తననే సస్పెండ్ చేస్తారా అంటూ ఏఈవో అచ్యుతరామయ్య నిరసన వ్యక్తం చేశారు. ఈవోతో వివాదానికి దిగారు. తనను కావాలని టార్గెట్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పెట్టుకుంటే అంతు చూస్తానంటూ రాద్ధాంతం చేశారు. తనేంటో ఈవోకు చూపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఈవో కోటేశ్వరమ్మ ఏఈవోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుర్గమ్మ సొమ్మను దోచేయడంతోపాటు తనను బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ కంప్లైంట్‌ ఇచ్చారు. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పాలకమండలి సమావేశంలోచర్చించి నిర్ణయం తీసుకుంటామన్న చైర్మన్‌
అయితే దుర్గగుడిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, ఉద్యోగుల సస్పెన్షన్‌కు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని చైర్మన్‌ గౌరంగబాబు తెలిపారు.  ఈవో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఏదైనా సమస్య చర్చలతో పరిష్కరించుకోవాలని, పోలీస్‌ స్టేషన్ వరకు తీసుకెళ్లడం సరికాదంటున్నారు. ఈ వ్యవహారంపై పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.మొత్తానికి దుర్గగుడిలో ఇంతకుముందు పాలకమండలి నేతల మధ్య వివాదాలు తలెత్తడం చూశాం. ఇప్పుడు అధికారుల మధ్యే వివాదాలు తలెత్తడం చూస్తున్నాం. మరోవైపు దుర్గగుడి తరచూ వివాదాల్లోకి ఎక్కడంతో భక్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

Don't Miss