​ఆసిఫాబాద్ లో మట్టి గణపతి విగ్రహాలు

07:46 - August 18, 2017

కొమరంభీం :కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండంలం ఈస్‌గాం లో మట్టిగణపతులు కనువిందు చేస్తున్నారు. చెరువు మట్టి, సహజరంగులతో పర్యావరణ హిత గణపతి విగ్రహాలను కొనడానికి స్థానికులు ఉత్సహపడుతున్నారు. ప్లాస్టర్‌ఆఫ్‌ప్యారిస్‌ తో తయారయ్యే విగ్రహాలు పర్యవరణానికి హాని కలుగుతున్న నేపథ్యంలో ఈజ్‌గాంలో తయారవుతున్న మట్టిగణపతులకు డిమాండ్‌ పెరిగింది. ప్రజల్లో వస్తున్న చైతన్యానికి ఇది నిదర్శనమని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. మొదట వెదురు బొంగులు, వరిగడ్డితో ఓ రూపాన్ని తయారు చేసుకుని..దానికి చెరువుమట్టిని పైపూతగా రాస్తారు. ఇలా బొమ్మలు నునుపుదేరే వరకు మట్టిని పలు దఫాలుగా వాడుతూ పూర్తి గణనాథుని రూపాన్ని తీసుకొస్తున్నారు ఈ కళాకారులు. ప్లాస్టర్‌ఆఫ్‌ప్యారిస్‌ విగ్రహాలకు ఏమాత్రం తీసిపోని విధంగా , చూడముచ్చటగా గణనాథుల విగ్రహాలు తయారవుతున్నాయి.

ప్రజల్లో పర్యావరణంపై అవగాహన
పశ్చిమబెంగాల్‌ నుంచి ఇక్కడికి వచ్చిన ఎందరో కళాకారులు.. మట్టిగణపతులతో ప్రజల్లో పర్యావరణంపై అవగాహన తెస్తున్నారు. వీరు తయారు చేసిన గణపతి విగ్రహాలను ఆసిఫాబాద్‌, మంచిర్యాలతోపాటు మహరాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు ఇచ్చి మరి తయారు చేయించుకుంటున్నారు. ఉపాధితోపాటు పర్యావరణానికి మేలు చేస్తున్న ఈ కళాకారులను అందరూ మెచ్చుకుంటున్నారు. మట్టిగణనాథులతోపాటు ఈ కళాకారులకూ జేజేలు పలకుతున్నారు భక్తజనం. 

Don't Miss