కథువా మృగాలకు ఉరే సరి అంటున్న ఐ.కా.స!..

18:52 - April 14, 2018

ఢిల్లీ : అత్యాచార ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఘాతుకానికి పాల్పడిన వారిని ఉరితీయాలని యూఎన్‌ సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ భారత ప్రభుత్వాన్ని కోరారు. ఓ పసిప్రాణాన్ని భయంకరమైన రీతిలో చిత్రహింసలకు గురిచేసి హత్యచేయడం మానవత్వానికికే మచ్చ అన్నారు. మీడియాలో వచ్చిన కథనాలు తనను ఎంతగానో కలచి వేశాయని.. ఇలాంటి మానవ మృగాలను క్షమించకూడదని గుటెర్రెస్‌ అన్నట్టు ఆయన ప్రతినిధి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా జమ్మూకశ్మీర్‌లోని కథువా గ్యాంగ్‌ రేప్‌ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. కథువా ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల అసిఫాకి మాదకద్రవ్యాలు ఇచ్చి మూడు రోజుల పాటు పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. 12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణదండనే సరైన శిక్షగా పేర్కొన్నారు. ఈ మేరకు పోస్కో చట్టంలో సవరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని మేనకాగాంధీ తెలిపారు. మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో స్ధానిక పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ముఫ్తీ మెహబూబా ప్రభుత్వం క్రైమ్‌ బ్రాంచ్‌కు కేసును అప్పగించింది. 8 ఏళ్ల అసిఫా మర్డర్‌ కేసులో పోలీసులు 8 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని రక్షించే ప్రయత్నం జరుగుతుండడంతో బాధితురాలి కుటుంబం గ్రామం విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

Don't Miss