గుజరాత్ లో ఎన్నికలు ఎందుకు ప్రకటించలేదు..?

13:11 - October 13, 2017

గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికల విషయంలో ఈసీ వైఖరి ఏంటీ ? డిసెంబర్ 18 లోగా ఎన్నికలుంటాయని చెప్పడంలో ఆంతర్యం ఏంటీ ? దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలోనే ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయలేదా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల నోటిఫికేషన్ ను జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి స్పష్టంగా ఎన్నిక తేదీలను ప్రకటించింది. కానీ గుజరాత్ రాష్ట్ర విషయానికి వచ్చే సరికి ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీనితో ఈసీపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో పీఎం మోడీ పర్యటన ఉండడం..అక్కడ వరాలు ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని, ఇప్పుడు తేదీలు ప్రకటిస్తే వరాలు కురిపించే అవకాశం ఉండదని..ఇది అందరకీ అర్థమయ్యే విషయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గుజరాత్ విషయంలో ఎన్నికలను దృష్టి పెట్టుకుని వరాలు ప్రకటించడం..జీఎస్టీ విషయంలో కేంద్ర వైఖరి అందులో భాగమేనని తెలుస్తోంది. గుజరాత్ రాష్ట్రంపై ప్రభావం చూపే వాటిపై తగ్గించారనే విమర్శలున్నాయి. పేరుకు స్వతంత్ర సంస్థలుగా ఉంచడం...ఆచరణకు వచ్చే వరకు ప్రభుత్వం పావులుగా వాడుకోవడం జరుగుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం చేతిలో ఎన్నికల సంఘం ఉండడం దురదృష్టకరమని ఆరోపిస్తున్నారు.

182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీ బీజేపీ అధికారం దక్కించుకుంటూ వస్తోంది. ఈ ఎన్నికల్లో 150 ఎమ్మెల్యేల బలం పెంచుకోవాలని కాషాయ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కానీ ప్రస్తుతం నోట్ల రద్దు..జీఎస్టీ..తదితర అంశాలు ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మోడీ స్వస్థలంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కావడం...2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు వస్తుండడం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ ఆ రాష్ట్రంలో పార్టీకి పలు సమస్యలు ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. పటేల్ వర్గం ఒబిసి కోటా ఉద్యమంతో మోడీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఇక గోవధ అంశంలో దళితులపై హింసాకాండ వంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ పై వ్యతిరేకత వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి.

మరి గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ? అక్కడ మోడీ వరాలు కురిపిస్తారా ? లేదా? అనేది వేచి చూడాలి. 

Don't Miss