కాళేశ్వరం ప్రాజెక్టుపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం

07:27 - January 25, 2018

కరీంనగర్/పెద్దపల్లి : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులను కేంద్ర అటవీ, పర్యాటక శాఖ కార్యదర్శి సి.కె. మిశ్రా పరిశీలించారు. ప్రాజెక్ట్‌కు చెందిన అన్నారం బ్యారేజీ, ప్యాకేజీ 11టన్నెల్‌, రంగానాయకి సాగర్‌ రిజర్వాయర్‌ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్ట్‌ వల్ల ప్రజలకు సాగు నీరు, త్రాగు నీరు ఎంతో ఉపయోగపడటమే కాకుండా.. పచ్చదనం, భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రాజెక్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

పర్యావరణానికి నష్టం జరగకుండా చూడడం
సిద్ధిపేట జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమాలను మిశ్రా పరిశీలించారు. అటవీశాఖ చేస్తున్న బ్లాక్‌ ప్లాంటేషన్‌ వల్ల అటవీ విస్తీర్ణం పెరుగుతుందన్నారు. హరితహారం దేశానికే ఆదర్శమన్నారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులను చేపట్టినప్పుడు పర్యావరణానికి నష్టం జరగకుండా చూడడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని మిశ్రా తెలిపారు. తెలంగాణ ప్రజల త్రాగు నీరు సాగు నీటి అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారని ఆయన అన్నారు. పనులు వేగంగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అడవుల పెంపకం, అటవీ పరిరక్షణ పట్ల టీఎస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు.త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్ట్‌ పూర్తయితే లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని మిశ్రా అన్నారు. ఆయన వెంట ప్రభుత్వ చీప్‌ సెక్రటరీ జోషి, కాళేశ్వరం సీఈ హరిరామ్‌ ఉన్నారు.

Don't Miss