నంద్యాల ఫలితంతో మారుతున్న సమీకరణాలు

07:25 - August 31, 2017

విజయవాడ : నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ఏపీలో రాజకీయ సమీకరణల మార్పుకు నాంది పలుకుతోంది. టీడీపీ భారీ మెజార్జీతో గెలవడంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీలోని ఒక వర్గం ఇప్పుడు పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేశాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో రెండు పార్టీలు అధికార భాగస్వాములుగా ఉన్నాయి. అయితే బీజేపీలోని ఒకవర్గం టీడీపీ ప్రభుత్వ విధానాలను ఎప్పుడూ వ్యతిరేకిస్తూ రావడంతో పాటు, విమర్శలు చేస్తూ వచ్చింది. రాష్ట్రం ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పోలవరంకు నిధులు ఇచ్చే విషయంలో రెండు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినా రెండు పార్టీ అధినాయకత్వాలు వాటంన్నిటికీ ఫుల్‌స్టాఫ్‌ పెట్టి, బంధాన్ని కొనసాగిస్తూ వచ్చాయి.

టీడీపీ, బీజేపీల మధ్య దూరం
అయితే వైసీపీ అధినేత జగన్‌ గత జూన్‌లో ప్రధాని మోదీని కలిసి, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకి మద్దతు ప్రకటించిన తర్వాత టీడీపీ, బీజేపీల మధ్య మళ్లీ కొద్దిగా దూరం పెరిగింది. వైసీపీ.. బీజేపీకి చేరువ అవుతున్నట్టు ప్రచారం జరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీతో ప్రయాణమంటూ ఏపీ కమలనాథుల్లో కొందరు ప్రచారం కూడా చేశారు. కొన్నిసందర్భాల్లో ఒంటరిపోరు అంటూ బాహాటంగానే ప్రకటించారు. పొత్తుల విషయం ఎన్నికలప్పుడంటూ చెప్పుకొచ్చారు. అయితే నంద్యాల ఫలితం తర్వాత బీజేపీ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చినట్టు భావిస్తున్నారు.

బంధం బలపడింది
రాయలసీమలో పట్టున్న వైసీపీని ఓడించి, నంద్యాలలో టీడీపీ గెలవడంతో... తెలుగుదేశం బీజేపీ మధ్య బంధం మరింత బలపడినట్టు భావిస్తున్నారు. నంద్యాలలో గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలపడంతోపాటు ఎన్డీయేలో టీడీపీ బలమైన భాగస్వామని ట్వీట్‌ చేయడం ద్వారా రెండు పార్టీల మధ్య సంబంధాలు మరింత మెరుగైనట్టు విశ్లేషిస్తున్నారు. నంద్యాలలో టీడీపీకి భారీ మెజార్టీ రావడంతో వైసీపీ కన్నా టీడీపీయే మేలన్న భావన బీజేపీలో పెరిగింది. పైగా ఈ ఫలితం తర్వాత చీటికి మాటికి టీడీపీని గుడ్డిగా వ్యతిరేకిస్తూ వస్తున్నబీజేపీలోని ఓ వర్గం ఇప్పుడు సైలెంట్‌ అయింది. మున్ముందు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమలనాథులు నోరు తెరిచే అవకాశం లేకుండా నంద్యాల ఫలితం కట్టడి చేసిందని భావిస్తున్నారు. 

Don't Miss