ఎస్సెల్ చేతికి అగ్రిగోల్డ్

21:36 - September 10, 2017

విజయవాడ : రూపాయి రూపాయి కూడబెట్టి.. అప్పులు చేసి మరీ అగ్రిగోల్డ్‌లో డిపాజిట్‌ చేసిన బాధితుల కష్టాలు తీరబోతున్నాయి. కోర్టు కేసులతో అగ్రిగోల్డ్‌లో ఉపాధి కోల్పోయిన వారికి మళ్లీ ఉద్యోగాలు రాబోతున్నాయి. సత్యం తరహాలో అగ్రిగోల్డ్‌ సంస్థను ఎస్సెల్‌ గ్రూప్‌ టేకోవర్‌ చేయబోతోంది.. ఇందుకు సంబంధించి రెండు సంస్థల మధ్య అవగాహన కూడా కుదిరింది. అగ్రిగోల్డ్‌ సంస్థ 1995లో ప్రారంభమైంది.. వ్యవసాయం, అనుబంధ రంగాలపై ప్రధానంగా దృష్టిపెట్టిన సంస్థ కొద్దికాలంలోనే వేగంగా విస్తరించింది. రియల్‌ ఎస్టేట్‌లోకూడా అగ్రిగోల్డ్‌ పెట్టుబడులు పెట్టింది. టూరిజంవైపూ అడుగులు వేసింది. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల ఇబ్బందుల్లో పడింది. యాజమాన్యంపై కోర్టులో కేసులు నమోదయ్యాయి. కోర్టు కేసుల తర్వాత అగ్రిగోల్డ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇలాంటి విపత్కర సమయంలో అగ్రిగోల్డ్‌ సంస్థను టేకోవర్‌ చేసేందుకు ఎస్సెల్‌ గ్రూప్‌ ముందుకొచ్చింది. MMR గ్రూప్‌ చైర్మన్‌ నవీన్‌ కుమార్‌ ఈ అగ్రిమెంట్‌ కుదర్చడంలో కీలకపాత్ర పోషించారు.

సమాజంపట్ల బాధ్యతగా..
నష్టాల దిశలో ఉన్న వ్యాపారాలను పెద్ద సంస్థలు కొనుగోలు చేసి లాభాలబాట పట్టేలా చేయడంలో నవీన్‌ కుమార్‌కు చాలా అనుభవముంది. అగ్రిగోల్డ్‌ విషయం తెలుసుకున్న నవీన్‌... సంస్థ గురించిన సమస్త సమాచారం సేకరించారు. అగ్రిగోల్డ్‌ సంస్థను ఒక ఆస్తి, అప్పుల పట్టీగా చూడకుండా సమాజంపట్ల బాధ్యతగా... 40 లక్షల కుటుంబాల సమస్యకు పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ముందడుగు వేశారు. ఇందుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయం చేసేలా ఎస్సెల్‌ గ్రూప్‌ను ఒప్పించారు. అగ్రిగోల్డ్‌ను టేకోవర్‌ చేస్తున్న ఎస్సెల్‌ గ్రూప్‌.. ప్యాకేజింగ్.. ఎస్సెల్‌ ఎక్స్‌పోర్ట్స్, ఎస్సెల్‌ వరల్డ్ పేరుతో అతి పెద్ద ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌... జీ గ్రూప్‌ పేరుతో దేశ విదేశాల్లో టీవీ చానల్స్‌... టీవీ పంపిణీ రంగంలో డిష్ టీవీ, సిటీ కేబుల్‌ లాంటి అనేక సంస్థలతో ఉత్తర భారత దేశంలో పెద్ద సంస్థగా అవతరించింది... రాజ్యసభ సభ్యుడైన సుభాశ్‌ చంద్ర... ఈ సంస్థకు చైర్మన్‌గా ఉన్నారు. ఒక్క వ్యాపారమే కాదు.. ట్రస్ట్‌ ద్వారా సేవా కార్యక్రమాల్లోనూ ఈ సంస్థ చురుగ్గా వ్యవహరిస్తోంది.. అగ్రిగోల్డ్‌ విషయం తెలుసుకున్న గ్రూప్‌ చైర్మన్‌.. ఈ సంస్థను టేకోవర్‌ చేసి ఉద్యోగులు, కస్టమర్ల సమస్య తీర్చాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆలస్యమైన ప్రక్రియ
ఈ ప్రక్రియ మూడు నెలలక్రితమే జరగాల్సి ఉన్నప్పటికీ... అగ్రిగోల్డ్‌ యాజమాన్యం రిమాండ్‌లో ఉండటంతో ఆలస్యమైంది.. త్వరలో ఈ రెండు సంస్థలమధ్య చట్టబద్దమైన ఒప్పందం కుదరబోతోంది. ఎస్సెల్‌ సంస్థ ఒప్పందం ద్వారా దాదాపు 40 లక్షలమందికి మేలు జరుగుతుంది.. అగ్రిగోల్డ్‌ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించి తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ఆర్థిక ప్రగతిలో ఎస్సెల్‌ గ్రూప్‌ తనవంతు పాత్ర పోషించబోతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిసిన ఎస్సెల్‌ గ్రూప్‌ యాజమాన్యం... సహకారం కోరింది. సీఎంకూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. కోర్టు కేసు ఉన్నా ఎస్సెల్‌ గ్రూప్‌ ఒప్పందం సజావుగా సాగే అవకాశం కనిపిస్తోంది.. కోర్టులో ఇప్పటికే అఫిడవిట్‌ దాఖలు చేసిన సంస్థ టేకోవర్‌ దిశగా అడుగులు వేస్తోంది.

Don't Miss