'ఆనం' షరతులు పెట్టారా ?

12:45 - July 8, 2018

నెల్లూరు : మాజీ మంత్రి ఆనం పార్టీ మార్పుపై నెలకొన్న సస్పెన్స్‌ త్వరలోనే వీడనుంది. వైసీపీ ఆయన చేరికకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్‌, ఆనం రాంనారాయణరెడ్డి భేటీ అవ్వడంతో ఆనం అతి త్వరలోనే వైసీపీ గూటికి చేరనున్నట్లు స్పష్టమవుతోంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మార్పుపై నెలకొన్న సంధిగ్ధంతోపాటు.. ఊహాగానాలకు త్వరలోనే తెరపడనుంది. ఆయన వైసీపీలో చేరేందుకు లైన్ క్లియర్‌ అయినట్లు సమాచారం. ఆనం టీడీపీని వీడి వైసీపీలోకి చేరుతారంటూ జోరుగా సాగిన ప్రచారానికి.... ఈ మధ్యలో కొంత బ్రేక్ పడింది. దీంతో మాజీ మంత్రి ఆనం వైసీపీలో చేరతాడా, లేదా అన్న సంధిగ్దం నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ శంషాబాద్ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్, ఆనం రామనారాయణ రెడ్డి కలయికతో సస్పెన్స్‌కు తెరపడింది. వారిద్దరి భేటీలో దాదాపు పది నిమిషాలు చర్చించుకున్నారు. ఆనం వైసీపీలో చేరికపై మాట్లాడుకున్నట్లు సమాచారం. దీన్నిబట్టి వైసీపీలో ఆనం చేరిక లాంఛన ప్రాయంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

తమ కుటుంబ సభ్యులందరితో కలిసి వైసీపీలో చేరాలని భావించారు ఆనం. కానీ వారంతా ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా ఉండడంతో.. అది సాధ్యం కాలేదు. ఆనం సోదరుల్లో విజయకుమార్ రెడ్డి వైసీపీలోనే ఉండగా, మరో సోదరుడు జయకుమార్‌ రెడ్డి టీడీపీలోనే కొనసాగుతానని తేల్చేశాడు. ఇక దివంగత ఆనం వివేకానందరెడ్డి ఇద్దరు కుమారుల్లో రంగమయూర్ రెడ్డి ఆనం రామనారాయణరెడ్డి వెంట నడుస్తుండగా.. మరో కుమారుడు సుబ్బారెడ్డి జనసేన వైపు అడుగులేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆనం రామనారాయణరెడ్డి మాత్రమే వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఆనం పెట్టిన షరతులతోపాటు.. వైసీపీనేతల అభ్యంతరాల వల్లే ఆయన చేరిక ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కాగా.. ఆనంకు వైసీపీ అధినేత జగన్‌ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో ఆనం, జగన్‌ కలయికతో సస్పెన్స్‌కు తెరపడినట్లైంది. అన్నీ కలిసొస్తే మరో వారం రోజుల్లోనే ఆనం తన అనుచరులతో కలిసి వైసీపీలోకి రావడం ఖాయం అన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో బలంగా ఉన్న వైసీపీ.. ఆనం చేరికతో మరింత బలం పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Don't Miss