కారెక్కనున్న ముఖేష్‌గౌడ్‌ ?

13:12 - January 24, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ సిద్దమవుతున్నారా ? వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే కారెక్కడం తప్పనిసరా ? ముఖేష్‌గౌడ్‌ గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు ఎంఐఎం కారణమా ? ముఖేష్‌ పార్టీ మారేందుకు ఒవైసీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారు. లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ.. 
ముఖేష్‌గౌడ్‌ వ్యవహారం కాంగ్రెస్ లో చర్చనీయాంశం 
కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న మాజీమంత్రి ముఖేష్‌గౌడ్‌ వ్యవహారం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నాటి నుంచి ఇప్పటివరకు గాంధీభవన్‌ మెట్లు ఎక్కని ముఖేష్‌గౌడ్‌... ఆ పార్టీని వీడుతారా అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. 
వారి బాటలోనే ముఖేష్‌గౌడ్‌ ?
ఇప్పటికే ఎంతోమంది నేతలు టీఆర్‌ఎస్‌లో చేరగా... వారి బాటలోనే ముఖేష్‌గౌడ్‌ కారెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గులాబీ నేతలతో చర్చలు పూర్తయ్యాయని... పార్టీలో చేరే ముహూర్తం మిగిలివుందని ముఖేష్‌గౌడ్‌ సన్నిహితులంటున్నారు. అంతా ఓకే అయితే... వచ్చే నెలలో ముఖేష్‌ గులాబీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 
ముఖేష్ టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారు ?  
అయితే.. ముఖేష్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు మారాలనుకుంటున్నా రనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఉత్తమ్‌, భట్టి విక్రమార్క, జానారెడ్డిలతో పాటు ఎవరితో విభేదాలు లేని ముఖేష్‌.. మూడున్నరేళ్ల తర్వాత టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారనేది పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే.. పీసీసీ నాయకత్వంతో మంచి రిలేషన్‌ ఉన్న ముఖేష్‌గౌడ్‌ పార్టీ మారేందుకు ఎంఐఎం కారణమని తెలుస్తోంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సలహాతోనే ముఖేష్‌ కారెక్కనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీ చేయనున్న ముఖేష్‌.. అక్కడ గెలవాలంటే మైనారిటీల ఓట్లు కీలకం. గతంలో కాంగ్రెస్‌-ఎంఐఎం పొత్తుతో ముఖేష్‌గౌడ్‌ ఈజీగా గెలిచారు. కానీ... ఇప్పుడు పరిస్థితులు మారాయి. తాజాగా టీఆర్‌ఎస్‌-ఎంఐఎంల దోస్తీ కొనసాగుతుండడంతో.. ముఖేష్‌కు గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అయితే... టీఆర్‌ఎస్‌లో చేరితే గెలుపునకు సహకరిస్తానని అసదుద్దీన్‌ ముఖేష్‌గౌడ్‌కు మాటిచ్చినట్లు సమాచారం. అలాగే ముఖేష్‌ కారెక్కెందుకు కేసీఆర్‌తో అసదుద్దీన్‌ మంత్రాంగం నడిపినట్లుగా తెలుస్తోంది. 
వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఎంఐఎం మద్దతు తప్పనిసరి
అయితే... టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముఖేష్‌గౌడ్‌ అయిష్టంగానే ఉన్నప్పటికీ... వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఎంఐఎం మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే... కారెక్కాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్న ముఖేష్‌గౌడ్‌ ముహూర్తం చూసుకొని గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదిలావుంటే... ఎంఐఎం ఆపరేషన్‌లో ముఖేష్‌ ఒక్కరే ఉన్నారా ? లేక ఇంకేవరైనా ఉన్నారా ? అన్నది ఇప్పుడు హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 

 

Don't Miss