ప్రియాకు ఫిదా అయిపోయారు..?

21:30 - February 14, 2018

హైదరాబాద్ : ఈ చూపులే ఇప్పుడు అబ్బాయిల మతి పోగోట్టాయి. ఈ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కే కోట్ల హృదయాల గుండెలు ప్రియా .. ప్రియా అని కొట్టుకుంటున్నాయి. ప్రియ ప్రకాష్‌ వారియర్.. బీకామ్ చదువుతున్న 18 ఏళ్ల ఈ కేరళ కుట్టి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. ఫేస్‌బుక్.. ట్విట్టర్.. వాట్సాప్.. ఎక్కడ చూసినా ప్రియ వీడియోలో హల్‌చల్ చేస్తున్నాయి. కేరళ త్రిసూర్‌కు చెందిన ప్రియ 'ఒరు ఆధార్‌ లవ్‌' సినిమాతో తెరంగేట్రం చేస్తోంది. ఈ సినిమాలోని 'మాణిక్య మలయ పూవి'పాటకొ వాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీలోని పాటను కొంచెం ముందుగా విడుదల చేశారు. ఈ పాటకు అనూహ్య స్పందన లభించింది. కన్ను గీటుతూ ఆ పాటలో ప్రియ పలికించిన హావభావాలకు నెటిజన్లంతా ఫిదా అయిపోయారు.

క్లాస్‌రూంలో చిలిపి సైగలతో
ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రియ నటించిన మరో వీడియో క్లిప్‌ను విడుదల చేశారు. క్లాస్‌రూంలో చిలిపి సైగలతో మరోసారి యూత్‌ను ఊపేసింది ప్రియ. ఒరు ఆధార్‌ లవ్ మూవీకి ముందు ప్రియ ప్రకాశ్.. మూడు షార్ట్‌ ఫిల్మ్స్‌ లో నటించింది. కొన్ని ఫ్యాషన్‌ షోలలో పాల్గొన్నది. మోడల్‌గా ర్యాంప్‌ వాక్స్‌ చేసింది. అంతేకాదు మోహినీ అట్టం కళాకారిణి కూడా. స్కూల్‌ డేస్‌లో నాటకాల్లో నటించిన ప్రియ ప్రకాశ్ కు మలయాళ మూవీలో అనుకోకుండా అవకాశం వచ్చింది. సీబీఎస్‌సీ ప్లస్‌ 2 బోర్డ్‌ ఎగ్జామ్స్‌ రాయడానికి ముందు ప్రియ ఈ సినిమా ఆడిషన్స్‌ కి వెళ్ళింది. అయితే, ఈ మూవీలో తనకు అవకాశం వస్తుందని ప్రియ ఊహించనే లేదట.. ఈ మూవీ అవకాశంతో ప్రియ ప్రకాష్‌ ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయింది. ప్రియ ప్రకాశ్ హావభావాలకు నెటిజన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఎంతో మంది హీరోలు ప్రియ ప్రకాష్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి క్యూటెస్ట్ వీడియోను చూడలేదంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కొందరైతే ఏకంగా ప్రియ వీడియోకు డోనాల్డ్ ట్రంప్, మోడీ, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, చంద్రబాబు వంటి రాజకీయ నేతలతోపాటు హీరోలు మహేష్‌బాబు, పవన్ కల్యాణ్, రజనీకాంత్‌లతో పాటు సల్మాన్‌ ఖాన్‌, షారూక్ ఖాన్‌ వంటి బాలీవుడ్ నటులను యాడ్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రియ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రియ ధాటికి సన్నిలియోన్.. కత్రినా కైఫ్‌..అనుష్క శర్మ..దీపికా పదుకోన్‌లూ గూగుల్‌ సెర్చ్‌లో వెనుకబడ్డారు. నిన్న ఒక్కరోజే ఇన్‌స్టా గ్రామ్లో ప్రియను అనుసరించే వారి సంఖ్య 6 లక్షలు పెరిగింది. ఒక్కరోజులో అత్యధిక ఫాలోయర్లను సాధించుకున్న సెలబ్రిటీగా ప్రియ చరిత్ర సృష్టించింది.

మరోవైపు ప్రియపై కొందరు విమర్శలు
ఓవైపు ప్రియకి ఇంత పాపులారిటీ వచ్చిపడుతుంటే.. మరోవైపు ప్రియపై కొందరు విమర్శలు వెదజల్లుతున్నారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ప్రియ ఆ పాటలో నటించిందని హైదరాబాద్ ఫలక్‌నుమాకు చెందిన పలువురు ముస్లిం యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రియ నటించిన వీడియోని పరిశీలించే పనిలో పడ్డారు. ఇక ప్రియను పాటలో చూసి ఇంతలా ఫిదా అయిపోతున్న కుర్రకారు ఏప్రియల్ రిలీజ్ అవుతున్న 'ఒరు ఆధార్‌ లవ్' సినిమాలో ఆమె పూర్తి నటనను చూసి ఏమైపోతారో ఏంటో?

Don't Miss