రైతులను ముంచిన 'కింగ్ రకం' పత్తి...

06:30 - December 7, 2017

ఆదిలాబాద్ : మరోసారి పత్తి రైతులు నిలువునా మోసపోయారు. పంట బాగా వస్తుందని నమ్మబలికితే.. కింగ్ రకం పత్తి విత్తనాలను కొనుగోలు చేశారు. పంట ఏపుగానే పెరిగింది... కానీ పూత, కాత మాత్రం రాలేదు. దీంతో.. ఆందోళన చెందిన రైతులు కంపెనీ ప్రతినిధులను నిలదీశారు. ఇంకా కొన్ని రోజులు ఆగితే... పంట వస్తుందని ఉచిత సలహాలు ఇచ్చారు. 

ఆదిలాబాద్‌ జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవడతో రైతన్నలు పత్తి పంటను ఎక్కువగా సాగు చేశారు. తమ కంపెనీ విత్తనాలు ఉపయోగిస్తే పంట బాగా పండుతుందని ఓ కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో... జైనథ్‌ మండలం మేడిగూడ(సి) రైతులు కింగ్‌ రకం పత్తి విత్తనాలు ఉపయోగించారు. పంటలు ఏపుగానే పెరిగినా... పూత, కాత లేకపోవడంతో.. అవి నకిలీ విత్తనాలమోనని రైతులు ఆందోళన చెందారు. ఈ వ్యవహారంపై కంపెనీ ప్రతినిధులను కలిశారు. అయితే.. వాతవరణంలో మార్పుల వల్లే... ఇలా జరిగిందని తప్పించుకునే ప్రయత్నం చేశారు.

కంపెనీ వ్యవహారంపై రైతులు మండిపడుతున్నారు. ఇతర రకాల విత్తనాలు ఉపయోగించిన రైతులకు దిగుబడి వస్తుండగా... తమ పరిస్థితి ఇలా తయారైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలు కట్టబెట్టి తమను మోసం చేశారని వాపోతున్నారు. న్యాయం చేస్తామని...హామీ ఇచ్చిన కంపెనీ పట్టించుకోకపోవడంతో... రైతులంతా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు తెలిపారు. కింగ్‌ విత్తనాలు ఉపయోగించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. ఇలాంటి మోసపూరిత కంపెనీల నుండి రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. 

Don't Miss