క్రేన్ కొక్కేలను శరీరానికి గుచ్చించుకుని పాలాభిషేకం...

13:20 - October 4, 2018

బాలీవుడ్..టాలీవుడ్..కోలీవుడ్..హాలీవుడ్..ఇలా ఏ వుడ్ లోనైనా సరే హీరో..హీరోయిన్లకు అభిమానులుంటారు. వారి వారి చిత్రాలు విడుదలవుతుందంటే అభిమానుల ఆనందానికి అవధులుండవు. ప్రముఖ హీరోల చిత్రాలు రిలీజ్ అయితే మాత్రం సంబరాలు ఆకాశాన్ని అంటుతాయి. కానీ ఒక్కోసారి ఈ ఆనందం హద్దులు మీరుతుంటుంది. మరికొంత మంది అభిమానులు వినూత్నంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటారు. తమిళనాట అభిమానులు ఒక అడుగు ముందే ఉంటారు. తాజాగా ఓ అభిమాని చేసిన ఓ పని సామాజిక మాధ్యమాల్లో గిర్రున తిరుగుతోంది. 

మణిరత్నం దర్శకత్వం వహించిన  ‘చెక్క చివంత వానం’ రిలీజైన సంగతి తెలిసిందే. తెలుగులో ‘నవాబ్’ పేరిట రిలీజై మంచి కలెక్షన్లతో దూసుకపోతోంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు ప్రధాన పాత్రలు పోషించారు. శింబు పాత్రకు మంచి మార్కులు పడుతుండడంతో అతని ఫ్యాన్్స తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఓ అభిమాని తన ఆనందాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. ఓ థియేటర్ వద్ద నెలకొల్పిన కటౌట్ కు పాలాభిషేకం చేయాలని అనుకున్నాడు. కానీ వెరైటీగా చేయాలని అనుకుని ఓ క్రేన్ ను తెప్పించాడు. క్రేన్ కొక్కేలను శరీరానికి గుచ్చించుకుని గాల్లోకి లేచాడు. సుమారు 25 ఫీట్ల ఎత్తున్న శింబు  పోస్టర్ కు పాలాభిషేకం చేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. అభిమానం ఉంటే గిలా ఉంటుందా ? అని ఆశ్చర్యపోయారు. ఇంత పిచ్చి అభిమానం ఏంటా అని అనుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. 

 

Don't Miss