పత్తిరైతుల గోసలు

20:17 - October 31, 2017

అ మొత్తం మీద ఓ కార్యం అయిపోయింది.. రేవంత్ కాంగ్రెస్ తొవ్వ దొక్కిండన్న అనుమానాల కాడికెళ్లి నిన్నటి ఆత్మీయుల సదస్సుదాక ఓ బాహుబలి సీన్మల సీన్ల లెక్క అల్లిచెప్పిండ్రు అందరు మీడియావోళ్లు..ఇగ ఇప్పుడు ఏక్ దం కాంగ్రెస్ పార్టీ కండువా మెడలేస్కోని బైటికొచ్చిండు రేవంతం సారు.. రాహుల్ గాంధీ అమ్మటాళ్ల యాళ్లకు కండువా గప్పిండు..

రే నీయక ఇదెక్కడి లేకి సర్కారురా నాయన..? పాపం జేఏసోళ్లు ఏ పనిజేశినా ముంగటవడనిస్తలేదు ప్రభుత్వం.. అమరవీరుల స్పూర్తి యాత్ర అంటే..అది అడ్డుకుంటరు.. ఇందిరాపార్కు రక్షణ అంటే అది అడ్డుకుంటరు.. కొల్వులకై కొట్లాట అంటే అది అడ్డుకుంటరు... ఇంతకు సర్కారు ఎందుకు గింత దిగజారుడు పనిజేస్తున్నదో అర్థమైతలేదు ఎవ్వలికి.. ఇగ ఆఖరికి కోదండరాం సారే నిరాహార దీక్షకు గూసున్నడంటె సూడుండ్రి..

తెలంగాణల టీఆర్ఎస్ ప్రభుత్వమొచ్చినంక రైతులు పెరుగన్నం దిని అర్గుమీద వంటున్నరని గప్పాలు గొట్టె నాయకులారా..? రాండ్రి మిర్యాల గూడ కాడ రైతులు అర్గుమీద వంటున్నరా రోడ్ల మీద వంటున్నరా అనేది వచ్చి సూస్తె తెలుస్తది..? చేతికి అందవల్సిన పంటను జూశి రోజు ఏడ్సుడు ఎందుకని నిప్పువెట్టిండంటే రైతన్న గుండె వల్గుతలేడా..?

తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమీషన్ అంత శిపాయి సంస్థ లోకంలనే లేదు.. ఎక్కడెక్కడోళ్లొచ్చి నోరు పెద్దగ దెర్సి పరేషాన్ అయితున్నరు..అబ్బా ఏం సంస్థ ఏం సంస్థ..? ఇసొంటి సంస్థ మాతానలేకపాయే.. ఈ సంస్థను వెట్టిన తురుంఖాన్ ముఖ్యమంత్రి మా రాష్ట్రంల లేకపాయే అని గుడ్లు తెర్సి సూస్తున్నరట.. కొయ్యర కొయ్యరా పొలిగా అంటే.. చింతమడ్క చింతకాయలు అందేం కాయంత దొడ్డు అన్నడట..

అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రిగారూ.. మీరు ప్రగతి భవన్ అని ఒకటి గట్టుకున్నరు తొమ్మిది ఎక్రాలళ్ల.. ఆ ఇంట్ల కరెంటి ఫిట్టింగు నల్లాల ఫిట్టింగు గాకముందుకే గృహ ప్రవేశం జేశిండ్రా మీ ఇంటిల్లాదులతోని..? అన్ని సౌకర్యాలు జేశ్నంకనేగదా అండ్లకు సొచ్చింది.. మరి మీ ఇంటికేమో గట్ల.. పదోని కోసం ఏడనో ఒకతాన గట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కరెంటొద్దు నీళ్లొద్దు.. అంటే.. ఏంది తమాషనా..?

ఎన్కట బావులకాడికి వొయ్యెటోళ్లకు గొర్లకాడికి వొయ్యెటోళ్లకు ఏం లేకున్నా సరేగని.. బుజాన గొంగడుంటే అదో ధైర్యముంటుండే.. ఎండొచ్చినా..? వానగొట్టినా.. సలివెట్టినా అన్నిటికి పనిజేసు జిందా తిలిస్మాత్ లెక్క సర్వానికి ఉపయోగపడ్తుండే.. కని ఇప్పుడు గొంగళ్లు గనిపిస్తున్నయా..? నా గొంగడి తప్ప ఏడగనవడ్తలేవు.. అవ్వినేశెటోళ్లు గనిపిస్తె అగ్గో గొంగళ్లు అని సూపెట్టవల్సొస్తున్నది పిల్లలకు..

అమ్మ నయ్యమైంది నాయనో.. పుసుక్కున అది మంది మీదవడ్తె ఎంత పెద్ద పర్శానైతుండే.. సికింద్రావాదుకాడున్న లాలాగూడ దిక్కు.. ట్రైనింగ్ విమానాలు తిర్గుతుంటయ్ గదా..? ఒక విమానం పోతుంటె పోతుంటెనే దాని దర్వాజ ఊశిపోయి ఒక ఇంటి మీదవడ్డదట.. పడ్తె జర్రంత సప్పుడే వస్తదా..? దిబేల్ మనంగనే జనమంత బైటికి ఉర్కొచ్చిర్రు..

కంచె శేను మేశినట్టే ఉన్నదిగదా కథ.. వాడు ఐపీఎస్ అధికారి అయ్యుండి.. ఇంకో పరీక్షల నక్కల చిట్టీలు గొట్టుకుంట పరీక్ష రాస్తున్నడంటే..? వాడు ఐపీఎస్ అధికారా..? లేకపోతె మాస్ కాపి మహనీయుడా..? కలెక్టర్ నౌకరి సంపాయించెతందుకు ఎంత ఇకమాతులు వడ్డడో సూడుండ్రి ఒకడు.. ఆఖరికి దొర్కిపోయి ఉన్నది వొయ్యింది ఉంచుకున్నది వొయ్యింది..

Don't Miss