రెండోరోజు రైతన్నల ఆందోళన..

21:57 - April 28, 2018

సూర్యాపేట : సూర్యాపేట మార్కెట్‌యార్డ్‌లో రైతుల ఆందోళన రెండోరోజుకు చేరింది. మద్దతు ధర కోసం అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు విపక్ష నేతలు మద్దతు తెలిపారు. రైతుల సమస్య పరిష్కరించే వరకూ ఉద్యమాన్ని ఆపబోమని హెచ్చరించారు.

రెండురోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు..
రెండు రోజులుగా మద్దతు ధర కోసం సూర్యాపేట మార్కట్ యార్డ్‌లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రైతులకు విపక్షాలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. మాజీ మంత్రి దామోదర్‌ రెడ్డిచ కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండ రెడ్డి మార్కెట్‌ యార్డ్‌ను సందర్శించారు. రైతులతో సంభాషించాక జిల్లా కలెక్టర్‌ను కలిసి కర్షకుల కష్టాలను ఆయనకి వివరించారు.

విపక్ష కాంగ్రెస్‌ నేతల విమర్శలు
మార్కెట్‌ యార్డ్‌లో ట్రేడర్లు సిండికేట్‌గా మారి.. రైతులకు గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారని విపక్ష కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. రైతులు దోపిడికి గురవుతుంటే పాలక పక్షం నాయకులు ఎవరూ పరామర్శించక పోవడం దారుణమన్నారు. సూర్యాపేట్‌ మార్కెట్‌కు వచ్చిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేశారు.

రైతుల కోసం భోజనం తీసుకు వస్తున్న వాహనాన్ని ఆపివేసిన అధికారులు
అటు భువనగిరి మార్కెట్‌ యార్డులో కాంగ్రెస్‌ నేతలు ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రానికి మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ అనుమతి నిరాకరించారు. రైతుల కోసం భోజనం తీసుకు వస్తున్న వాహనాన్ని గేటు బయటే ఆపి.. తాళాలు వేయించారు. దీంతో రైతులు గేటు బయటే కూర్చుని భోజనాలు చేశారు. అనంతరం గేటు తాళాలు తీశాక, కాంగ్రెస్‌ శ్రేణులు మార్కెట్ యార్డ్‌ చైర్మన్‌ గదిలోకి చొరబడి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌కు కాంగ్రెస్‌ కార్యక్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

 

Don't Miss