విజయనగరంలో పిడుగుల వర్షం

13:33 - August 30, 2017

విజయనగరం : వెన్నులో వణుకు పుట్టిస్తున్న పిడుగులు..పిడుగుపాటుతో రైతులు, పశువులు మృత్యువాత..రెండు రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి...విజయనగరం జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మెరుపువేగంతో వచ్చి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. పొలం పనులు చేసుకుంటున్న అన్నదాతలపై విరుచుకుపడుతున్నాయి. వారిమీదే ఆధారపడిన కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి. విజయనగరం జిల్లాలో ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కలవరం సృష్టిస్తున్నాయి. రెండో రోజుల వ్యవధిలోనే పిడుగుల దాటికి ఏడుగురు రైతులు బలైపోయారు. ఎల్‌.కోట మండలం ఖాసాపేట గ్రామానికి చెందిన రైతుతో పాటు.. రంగాపురం పంచాయతీ కూర్మవరానికి చెందిన వృద్ధురాలు, జామి మండలం కలగాడకు చెందిన పశువుల కాపరి పిడుగు పాటుతో మృతి చెందారు. ఈ ప్రమాదంలో అతని గేదెకూడా చనిపోయింది.

పనికి వెల్లలేకపోతున్న రైతులు
లక్కవరపుకోట మండలం కూర్మవరం గ్రామానికి చెందిన వృద్ధురాలు కేల్ల దాలమ్మ పిడుగుపాటుకు బలైపోయింది. ఇక ఖాసాపేట గ్రామానికి చెందిన బాడితబోని ఎర్నాయుడు పొలం పనులు చేస్తుండగా.. పిడుగుపడటంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. పెద్ద కూతురుకు పెళ్లి కాగా.. రెండో కూతురుకు పెళ్లి చేయాల్సి ఉంది. ఈ సమయంలో ఇంటి పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. లక్కవరపుకోట మండలం ఖాసాపేటలోనూ పిడుగుల వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామంలో కోళ్ల రామునాయుడు, కొటాన అప్పలనాయుడు, బాడితబోని ఎర్నాయుడు మృత్యువాత పడ్డారు. వరుసగా పడుతున్న పిడుగులతో ఖాసాపేట వాసులు హడలెత్తిపోతున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు.

అధికారుల నిర్లాక్ష్యం
పిడుగుపాటుతో మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. మరోవైపు పిడుగులు ఏ ప్రాంతంలో పడుతాయో ముందస్తు సమాచారం అందుతున్నా.. ఆయా గ్రామాల వాసులను అప్రమత్తం చేయడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Don't Miss