'కాళేశ్వరం' ముంపు బాధితులు..ఆందోళన బాట

08:41 - September 11, 2017

నిజామాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధిత గ్రామాల ప్రజలు ఆందోళనకు సిద్ధ మవుతున్నారు. పాత డిజైన్‌ ప్రకారమే ప్రాజెక్టు నిర్మించాలన్న డిమాండ్‌తో ఉద్యమానికి రెడీ అవుతున్నారు. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకంకాదని... అయితే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌ చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువని వాదిస్తున్నారు. అందుకే డిజైన్‌ మార్చకుండా  ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
మారిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రూపురేఖలు
ప్రాణహిత - చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు 21వ ప్యాకేజీలో భాగంగా  నిజామాబాద్‌ జిల్లాలోని మంచిప్ప, కొండెం చెరువులను  వేర్వేరు రిజర్వాయర్లుగా వాడుకోవాలని నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది.  అయితే టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు రూపురేఖలే మారిపోయాయి. ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్‌ చేసిన ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. మంచిప్ప, కొండెం చెరువులు వేర్వేరుకాకుండా  రెండు చెరువుల మధ్యలో ఉన్న ప్రాంతానంతా కలిపి ఓ భారీ జలాశయంగా మార్చాలని డిజైన్‌ చేసింది. 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని భావించింది. కానీ 3.5 టీఎంసీలకు మాత్రమే అనుమతులు ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా... అసలు సమస్య ఇక్కడే మొదలైంది.
నిరాశ్రయులువుతోన్న 10 గ్రామాల ప్రజలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన మంచిప్ప రిజర్వాయర్‌తో మూడు గ్రామాలు , ఏడు గిరిజన గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఈ గ్రామాల్లోని ప్రజలంతా నిరాశ్రయులవుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టింది. ప్రజలంతా ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైనింగ్‌ చేయడం వల్ల ఏ ఉపయోగం లేదని ముంపు వాసులు చెబుతున్నారు. అప్పుడు మూడు గ్రామాలే ముంపు బారిన ఉంటే... ఇప్పుడు 10 గ్రామాల వరకు ముంపుకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1200 ఎకరాల ఆయకట్టుకు నష్టం కలుగమేకాకుండా... 800 ఎకరాల్లోని అటవీ సంపద మునిగిపోతుందని.. తద్వారా ఇది పర్యావరణాన్ని దెబ్బతింటుందన్నారు.  పాత డిజైన్‌ ప్రకారమే ప్రాజెక్టు నిర్మించాలని కోరుతున్నారు.
భయబ్రాంతులకు గురిచేస్తోన్న ప్రభుత్వం : ముంపు బాధితులు  
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం తమను భయబ్రాంతులకు గురిచేస్తోందని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు  బలవంతంగా లాక్కుంటున్నారని వాపోయారు. తమ భూములకు సరైన పరిహారం కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పరిహారం కోసం మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నామన్నారు.  తమకు డబ్బులు వద్దని.. భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు ఇప్పించాలని వేడుకుంటున్నారు.
ఆందోళనకు సిద్ధమవుతున్న బాధితులు
పాత డిజైన్‌ ప్రకారమే ప్రాజెక్టు నిర్మించాలని బాధితులంతా ఆందోళబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.  ముంపు గ్రామాల ప్రజలు ఓ కమిటీని ఏర్పాటు చేసుకుని ఆందోళనలు చేసేందుకు రెడీ అవుతున్నారు.  తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు నిర్వహిస్తూనే ఉంటామని ముంపు బాధితులు స్పష్టం చేస్తున్నారు.   

 

Don't Miss