ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో సడక్‌ బంద్‌

07:57 - June 1, 2018

ఖమ్మం/కరీంనగర్‌ : కౌలు, పోడు రైతులకు కూడా రైతు బంధు పథకాన్ని వర్తింప చేయాలన్న డిమాండ్‌తో ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో జరిగిన సడక్‌ బంద్‌ ఉద్రిక్తతలకు దారితీసింది. రహదారులను దిగ్బంధించిన అఖిలపక్ష  రైతు సంఘాల నాయకులు, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులు, నిర్బంధాలు ఉద్యమాలను ఆపలేవంటూ.. రైతుబంధు పథకాన్ని కౌలు, పోడు రైతులకు వర్తింపచేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రైతుబంధు పథకాన్ని కౌలు, పోడు రైతులకు కూడా వర్తింప చేయాలన్నడిమాండ్‌తో ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో జరిగిన సగడక్‌ బంద్‌ ఉద్రిక్తతలకు దారితీసింది. బంద్‌లో అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రోడ్లను దిబ్బంధించి, నిరసన తెలిపారు. 

అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ ప్రదర్శన జరిగింది. రాపర్తినగర్‌ సెంటర్‌లో రోడ్లను దిగ్బంధించారు. దీంతో వాహనాలరాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో సడక్‌ బంద్‌ చేస్తున్న అఖిలపక్ష రైతు సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న రైతుబంధు పథకం ఎన్నికల ఎత్తగడ అని వామపక్ష  రైతు సంఘాల నాయకులు విమర్శించారు. రైతుబంధు పథకం ఎన్నికల ఉద్దీపన పథకం అంటూ ప్రజా సంఘాల నాయకులు ఎద్దేవా చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కరీంనగర్‌ జిల్లా ఎల్కతుర్తిలో రహదారులను దిగ్బంధించిన టీజేఎస్‌ అధ్యక్షడు కోదండరామ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితోపాటు రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి, హసన్‌పర్తి పోలీసు స్టేషన్‌కు తరలించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. 

రైతు సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దారుణంగా విఫలమయ్యారని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దిగొచ్చి కౌలు, పోడు రైతులకు  కూడా రైతుబంధు పథకాన్ని వర్తింపచేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. 

Don't Miss