పరిహారం చెల్లించండి

18:14 - July 29, 2017

వనపర్తి : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్ట్‌ నిర్మాణాలు... అనేక గ్రామాల ప్రజలను నిర్వాసితులుగా మారుస్తున్నాయి. పాలకుల అరకొర పరిహారం చెల్లింపులతో.. నిర్వాసితులు ఉపాధికి, వసతికి దూరం అవుతున్నారు. రైతుల ఇళ్లు, భూములు లాక్కుని రోడ్డున పడేలా చేస్తున్నారు. దీంతో వారంతా ఆందోళన బాట పడుతున్నారు. ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా... వనపర్తి జిల్లా... రేవల్లీ మండలంలో ప్రభుత్వం ఎదుల రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపడుతోంది. ఈ నిర్మాణం వల్ల బండరాయిపాకుల, కోంకలపల్లి, ఎదుల, తిగలపల్లి, నాగపుర్ గ్రామాల రైతులు ఐదు వేల ఎకరాలకు పైగా భూములను కోల్పోతున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమ బతుకులు ఏమిటంటూ.. ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టా ఉన్న వారికి 5.5 లక్షలు, అసైన్డ్‌ భూమి ఉన్న వారికి 3.5 లక్షలు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడానికి సిద్ధమైంది.

అరకొర పరిహారంతో...నిర్వాసితులుగా మారుస్తున్న ప్రభుత్వ చర్యలపై ముంపు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు, ర్యాలీలతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... పూర్తి పరిహారం చెల్లించాలని.. పునరావాసం కల్పించాలని కోరుతున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాత్రమే తమకు పరిహారం చెల్లించాలని.. ఆయకట్టు కింద భూమి ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే ముంపునకు గురవుతున్న రెండు గ్రామాల ప్రజలు పునరావాసం కల్పించిన తర్వాతే ఖాళీ చేస్తామని తేల్చి చెబుతున్నారు. మేలు చేస్తాడని ఎన్నుకున్న ఎమ్మెల్యే చిన్నారెడ్డి గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదంటూ.. వాపోతున్నారు. ఆ గ్రామాల ప్రజల పోరాటానికి సీపీఎం కూడా మద్దతుగా నిలిచింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆ గ్రామాల్లో పర్యటించి.. నిర్వాసితుల బాధలను తెలుసుకున్నారు. వారికి న్యాయం జరిగే వరకూ సీపీఎం పార్టీ తోడుగా ఉంటుందని తమ్మినేని హామీ ఇచ్చారు.

 

Don't Miss