సింగూరు జలాల కోసం రైతుల ఆందోళన

11:53 - August 5, 2017

నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సింగూరు జలాలను ఎప్పుడు విడుదల చేస్తుందా అని.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సింగూరు జలాలను విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, రాస్తారోకోలు ఉధృతమవుతున్నాయి. ఖరీఫ్‌ ప్రారంభమై 2 నెలలైనా.. భారీ వర్షాలు కురవకపోవటంతో.. రైతులు సింగూరు జలాలపైనే ఆశలు పెట్టుకున్నారు.

నిజాంసాగర్ ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో....

సింగూరు జలాలను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందోనని.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవటంతో.. వేసిన పంటలకు నీరెలా అందుతుందోననే ఆందోళన రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఖరీఫ్‌ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. నిజాం సాగర్‌ ప్రాజెక్ట్‌లోకి చుక్క నీరు వచ్చిచేరలేదు.

వేల ఎకరాలలో వరి నాట్లు....

ప్రాజెక్ట్‌ నుంచి నీరు వస్తుందనే భరోసాతో ఆయకట్టు కింద రైతులు వేల ఎకరాలలో వరి నాట్లు వేశారు. కానీ నిజాం సాగర్‌ ప్రాజెక్ట్‌లో మాత్రం సాగుకు సరిపడా నీరు లేదు. ఇప్పటికే సింగూరు జలాలను విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయమంత్రి జిల్లాలలోనే ఇలా ఉంటే ఎలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

5 టీఎంసీల నీరు విడుదల ....

సింగూరు నుండి 5 టీఎంసీల నీటిని విడుదల చేస్తే.. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల్లో ఈ ఖరీఫ్‌ గట్టేక్కే అవకాశం ఉంది. గతంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీశ్‌రావుతో సింగూరు జలాల గురించి ఫోన్‌లో మాట్లాడారు. కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. సింగూరు జలాలను నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు వదలకుంటే ఆయకట్టు రైతులపై తీవ్ర ప్రభావం పడనుంది.

లక్ష ఎకరాల్లో వరి నాట్లు .....

ఇప్పటికే రెండు జిల్లాల ఆయకట్టు కింద సుమారు లక్ష ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఖరీఫ్‌ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా భూ గర్భ జలాలు పెరగటం లేదు. బీర్కూరు, నసురుల్లాబాద్, రుద్రూరు, కోటగిరి, బోధన్‌ తదితర మండలాలకు చెందిన ఆయకట్టు రైతులు సింగూరు జలాల కోసం రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. సింగూరులో ప్రస్తుతం నీరు సమృద్ధిగా ఉండటంతో తమ వాటా కింద రావాల్సిన 8 టీఎంసీల నీటికి బదులు.. 5 టీఎంసీల నీటిని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వదలాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నీటిని ప్రభుత్వం జులైలోనే విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటికీ విడుదల చేయకపోవటంతో ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సింగూరు జలాలు విడుదల చేస్తేనే తమ పంటలు దక్కుతాయని రైతులు చెబుతున్నారు. 

Don't Miss