ధాన్యం కొనుగోలు చేయాలంటూ...

11:26 - April 27, 2018

నల్గొండ : రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం...పంట పెట్టుబడి కింద నగదు అందిస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతులు సమస్యలు మాత్రం తీరడం లేదు. రైతుల ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఎక్కడో ఒక చోట రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తమకు మద్దతు ధర కల్పించాలని..ధాన్యం కొనుగోలు చేయాలని ఆయా ప్రాంతాల్లో రైతన్నలు నిరసనలు..ఆందోళనలు చేపడుతున్నారు. శుక్రవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ కు వరుస సెలవులు ప్రకటించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంపైకి దాడికి దిగారు. కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. మద్దతు ధర కంటే తక్కువగా ప్రకటిస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర చెల్లించే విధంగా చేస్తామని..ధాన్యం కొనుగోలు చేస్తామని గురువారం అధికారులు హామీనిచ్చారు. కానీ శుక్రవారం అదే పరిస్థితి కొనసాగడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మరి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రైతుల సమస్యలు పరిష్కరిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

Don't Miss