నాన్నకు ప్రేమతో..

16:48 - June 18, 2017

నాన్నకు ప్రేమ .. సహనం ఎక్కువ.. ఓర్చుకునే గుణం కూడా ఎక్కువే. ఉద్యోగం అంటూ ఉదయాన్నే పరుగులు పెడతాడు. కుటుంబం కోసం నిద్రను కూడా మర్చిపోతాడు. ఇంటి బాధ్యతల్ని ఒంటి స్తంభంలా మోస్తాడు. ఏదీ పైకి చెప్పడు.. మనసునిండా ప్రేమిస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో నాన్నే సూపర్ హీరో.. ఈరోజు ఫాదర్స్ డే.. నాన్నకు ప్రేమతో.. శుభాకాంక్షలు చెబుదాం.. కనిపెంచే దేవత అమ్మ అయితే..నడిపించే దైవం నాన్న. నాన్నంటే భద్రత.. భరోసా.. బాధ్యత.. అలాంటి నాన్నను పూజించుకునే రోజు ఫాదర్స్ డే.. ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాల్లో జూన్ మూడో ఆదివారం రోజున ఫాదర్స్ డే జరుపుకుంటారు.
నాన్న పిల్లల్లో పిల్లాడైపోతాడు. ఆటలాడి బుజ్జగిస్తాడు.. ఎన్నో ఊసులు చెప్పి నిద్రపుచ్చుతాడు. మారాం చేస్తే బ్రతిమాలుతాడు. పిల్లల్తో తను గడిపేది తక్కువే అయినా అదే తనకు వెయ్యేళ్ల జీవితంగా భావిస్తాడు. నాన్నంటే ఒక రిలేషన్ మాత్రమే కాదు.. ఒక ఎమోషన్ కూడా..కూతుర్ని ప్రాణంగా పెంచుతాడు నాన్న. ఆమె పట్ల నాన్న బాధ్యత చాలా గొప్పది.. కూతురు ఎంత పెరిగినా ఇంకా నాన్నకు చిన్నపిల్లే. చదువుసంధ్యల దగ్గర్నుంచి ఆమెకు పెళ్లై అత్తారింటికి పంపే వరకు నాన్న పడే కంగారు అంతా ఇంతా కాదు. తీరా ఆమె పెళ్లై వెళ్లిపోతుంటే నాన్న కంట కన్నీరు ఆగదు.
కొడుకుకి నాన్నే రోల్ మోడల్.. కొడుకుతో ఒక ఫ్రెండ్‌లా ఆలోచనలు పంచుకుంటాడు నాన్న. ఏ తప్పు చేసినా .. చిరునవ్వుతో మందలించేస్తాడు. నాన్నంటే ఓ మానసిక స్థైర్యం. నాన్న హృదయం అనంత సాగరం. నాన్న .. వేలు పట్టుకుని నడిపిస్తాడు. భుజాలపై కూర్చోపెట్టుకుని ప్రపంచాన్ని చూపిస్తాడు. ఒళ్లో కూర్చోబెట్టుకుని చదువు నేర్పిస్తాడు. బిడ్డల బ్రతుకుకి బంగారు బాటలు వేస్తాడు. నాన్న డబ్బు మాత్రమే కాదు. వారసత్వాన్ని, పేరుని, సంస్కారాన్ని ఇస్తాడు. ఆయన దగ్గర అన్ని తీసుకుని తిరిగి నాన్నకు ఏమి ఇవ్వగలం.. ఏమిచ్చినా నాన్న రుణం తీరనిది.. ఇలా ఫాదర్స్ డే రోజే నాన్నను గుర్తు చేసుకోవడమే కాకుండా.. ప్రతిరోజు అమ్మనాన్నల్ని ప్రేమిద్దాం.

Don't Miss