స్త్రీజాతి స్వేచ్ఛను కోరిన కల్పనా రెంటాల

13:30 - March 26, 2017

ఆమె కలంలో అధునాతన భావాల జలపాతాలు జాలువారుతుంటాయి
ఆమె గళంలో ప్రగతిశీల భావనల సముద్రాలు ఉప్పొంగుతుంటాయి
ఆమె స్త్రీజాతి స్వేచ్ఛను కోరి రచనలు చేసిన కవయిత్రి...
ప్రేమకు పెళ్ళికి మధ్య నలిగిపోయిన అంతరాల అంత:సంఘర్షణను అక్షరాల్లో చూపించిన నవలా రచయిత్రి...
ప్రవాసాంధ్ర జీవన దృశ్యాలను కథలుగా..... నవలలుగా శిల్పీకరించిన కథనశిల్పి...
ఆమె కల్పన రెంటాల..
తెల్లటి పూల గుత్తులు రోడ్డంతా
మంచు ప్రేమ మైకంలో మునిగిపోయే మాడిసన్
చివరి చూపు, చివరి మాటల్లాగా
ఎండిపోయిన చెట్లు
ఆఖరిక్షణాల్లో ఆత్మీయపు పలకరింతల్లాగా
మళ్లీ తొలిప్రేమంతా తాజాగా
ఓ తెల్లటి కౌగిలింతలో ఒదిగి పోయిన రెండు రాబిన్ పక్షులు
అంటూ అద్భుత భావుకతతో కవిత్వం రాసిన కల్పన రెంటాల కలానికి రెండు పక్కలా పదునే అని చెప్పాలి. 

కవిత్వం రాసినా.. కథరాసినా.. నవల రాసినా రెంటాల కల్పన అక్షరాలలో జీవితం ఉంటుంది.. జీవం ఉంటుంది.. అనుభూతి ఉంటుంది.. ఆర్ధ్రత ఉంటుంది.. సున్నితమైన మనోభావాలుంటాయి.. బలమైన తాత్వికతా నీడలుంటాయి.. స్త్రీ పురుషుల అంత:సంఘర్షణల తాలుకూ చేదు నిజాలుంటాయి. అణచివేతల ఆనవాళ్లుంటాయి.. మానవీయ కోణాలుంటాయి.. అనుభవాలుంటాయి.. ఆదర్శాలుంటాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే రెంటాల కల్పన రచనల్లో.. ఒక కొత్తదనం ఉంటుంది. అందుకు ఉదాహరణే... ఆమె రాసిన సంచలన నవల...తన్హాయి 

వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ఎన్నో నవలలు వచ్చాయి. స్త్రీ పురుష సంబంధాలపై సంచలనాత్మక నవలలు వెలువడ్డాయి.. అందులో చలం మైదానం. ఒకటి.
ఆ.. నవలలోని ఇతివృత్తం అప్పట్లో సంచనలం సృష్టించింది. పెళ్లైన రాజేశ్వరి..ఒక ముస్లిం యువకుని వెంట వెళ్లి స్వేచ్ఛగా జీవించిన ఇతివృత్తం అప్పట్లో ఓ విస్ఫోటనాన్నే సృష్టించింది. సమాజంలోని కట్టుబాట్లను తెంచి తుప్పుపట్టిన మానవ మస్తిష్కాలను కొత్తగా ఆలోచింపజేసిన నవల అది. చాలా ఏళ్ల తర్వాత అదే దారిలో ఓ నవలను రాసి పెను సంచలనం సృష్టించారు కల్పనా రెంటాల.. తన్హాయి నవలతో పలు చర్చలకు తెర లేపారు. పాఠకుల్లో సరికొత్త ఆలోచనలు రేకెత్తించారు..

ప్రవాసాంద్రులైన రెండుకుటుంబాలలోని పెళ్లైన స్రీపురుషుల మధ్య జరిగే ప్రేమతాలూకు అనుభూతుల కెమిట్రీచుట్టూ ..అల్లిన నవల ఇది. స్వేచ్ఛ.., అంత: సంఘర్షణ.., సమాజపు కట్టుబాట్లు.., భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ రాహిత్యం, విదేశాల్లో ఉన్న భారతీయుల కుటుంబ సంబంధాలు ఇత్యాది అంశాల చుట్టూ అల్లిన నవల తన్హాయి. ఎన్నో ప్రశ్నలు..చర్చలు..లేవదీసిన..తన్హాయి నవల..రచయిత్రికి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది.

కల్పన రెంటాల తొలుత కవయిత్రిగా ఎంతో పేరుతెచ్చుకున్నారు. 2001 లో వెలువరించిన  నేను కనిపించే పదం అనే కవితా సంకలనంలో స్త్రీవాద కవితలతో పాటు వస్తువైవిధ్యం శిల్ప సోయగం ఉట్టి పడే కవితలెన్నో ఉన్నాయి. అవన్నీ ఆమెను.. కవయిత్రిగా.. తెలుగు కవితా రంగంపై నిలబెట్టాయి. అంతేకాదు.కల్పనా రెంటాల..ఒక జర్నలిస్టుగా ఎన్నో మానవీయ కథనాలకు పత్రికల్లో అక్షరరూపమిచ్చిన అనుభవంతో అద్భుతమైన కథలు రాశారు.. ఆమె రాసిన కథల్లో.. స్లీపింగ్ ఫిల్, అయిదో గోడ, కప్లెట్, ఇట్స్ నాట్ ఓ.కె కథలు అప్పట్లో పాఠకులను ఎంతగానో అలరించాయి.ఆలోచింపజేశాయి. కథానిర్మాణంలో పాత్ర చిత్రణలో... వాతావరణ కల్పనలో.. సంఘటనల కూర్పులో ..వాస్తవిక దృశ్యాల చిత్రణలో.. సహజత్వం ఉట్టి పడే కథలవడంతో రచయిత్రికి తెలుగు కథాసాహిత్యంలో మంచి గుర్తింపు వచ్చింది. 

నిజం చెప్పాలంటే కల్పనా రెంటాలకు సాహిత్య అభిలాష, అభినివేశం ఆమె తండ్రి రెంటాల గోపాలకృష్ణ నుంచి వచ్చిందని చెప్పాలి. ఇక ఆమె సహచరుడు ప్రముఖకవి అప్సర్ తో కలసి అనంతపురం నుండి అమెరికా వరకు ప్రయాణించిన ...జీవితం, సాహిత్యం కలబోసిన ప్రయాణంలో ఆమె సృజనాత్మకత వేయి పూలుగా వికసించింది. 2003 లో అమెరికా వెళ్లాక కల్పన రెంటాల కల్పనలో అనూహ్యమైన మార్పులొచ్చాయి. అద్భుతమైన నవల తన్హాయి అక్కడే అక్షరీకరింపబడింది. 2011 లో ఆమె బ్లాగు తూర్పు పడమరలో ఆ...నవల సీరియల్ గా 10 నెలలపాటు వచ్చింది. విశేష ఆదరణ పొందిన తన్హాయి నవల ఆమెకు ఎందరో అభిమాన పాఠకులను తెచ్చి పెట్టింది .

విజయవాడలోనే పుట్టి పెరిగిన కల్పన 1980లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో టెలివిజన్ కళాసాంస్కృతిక రంగాల సమీక్షలు రాసే జర్నలిస్టుగా  ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తర్వాత స్వాతి వారపత్రికలో పనిచేశారు. విజయవాడ ఆకాశవాణిలో న్యూస్ రీడర్ గా కూడా పనిచేశారు. ఆంధ్రభూమిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తూనే ప్రవృత్తిగా రచనా రంగంలో కృషిచేశారు. ఆమె రాసిన నేను కనిపించే పదం కవితా సంకలనానికి అజంతా అవార్డు లభించింది. అలాగే `ఆమెపాట` పేరుతో కల్పన రెంటాల ఆంధ్రభూమిలో రెండేళ్లపాటు వివిధ భాషల్లో వచ్చిన స్త్రీల కవితల విశ్లేషణతో  ఆమెకు మంచి  గుర్తింపు వచ్చింది. 

తెలుగు స్త్రీవాద సాహిత్యంలో తనదైన గొంతు వినిపించిన కవయిత్రిగా.. కథాసాహిత్యంలో తనదైన సృజన శిల్ప ప్రతిభలను ప్రదర్శించిన కథనశిల్పిగా... తన్హాయి లాంటి ఒక్క నవలతో సంచలన నవలాకారిణిగా గుర్తింపు పొందిన కల్పన,  అప్సర్ తో పాటు సారంగ వెబ్ మాగజైన్ నిర్వహణలో తనదైన కృషిచేస్తూ.. కొత్త కవులకు రచయితలకు బాసటగా కూడా నిచిచారు. 

జర్నలిస్టుగా.. కవయిత్రిగా, నవలా కారిణిగా బహుముఖీనమైన కృషి చేస్తున్న కల్పన రెంటాల కలం నుండి భవిష్యత్తులో మరెన్నో కవితా.. కథా సంకలనాలతో పాటు సంచలన నవలలు కూడా వెలువడాలని ఆశిద్దాం...

Don't Miss