ఇండోనేషియాలో పేలుడు... 47 మంది మృతి

22:11 - October 26, 2017

జకార్తా : ఇండోనేషియాలో బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 47 మంది మృతి చెందారు. జకార్తా సమీపంలోని తంగెరాంగ్‌ ప్రాంతంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనమంతా వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని 47 మంది సజీవ దహనమయ్యారు. మరో 43 మంది గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 103 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంటల ధాటికి భవనం చాలా వరకూ కుప్పకూలింది. పక్కనే ఉన్న కార్లు కూడా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. మృతులను గుర్తుపట్టరాని విధంగా అగ్నికి ఆహుతైపోయారని అధికారులు చెప్పారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.

 

Don't Miss