మరో పోరుకు భావనపాడు ప్రజలు సిద్ధం

08:03 - January 27, 2018

శ్రీకాకుళం : ముందేమో హార్బర్‌ నిర్మిస్తామని చెప్పారు. ఆ తర్వాత మాటమార్చారు. హార్బర్‌ స్థానంలో ఓడరేవు నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఏపీ కేబినెట్‌లో నిర్ణయం కూడా జరిగింది. దీంతో సర్కార్‌పై సమరానికి శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు ప్రజలు రెడీ అవుతున్నారు. ప్రజాభిప్రాయం లేకుండా ముందుకు సాగితే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు.
మంత్రివర్గ తీరుపై స్థానికులు మండిపాటు 
శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు, సంతబొమ్మాళి మండలాల పరిధిలో గల భావనపాడు ప్రాంతీయులు మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఓడరేవు నిర్మించాలన్న మంత్రివర్గ నిర్ణయానికి వ్యతిరేకంగా ఐక్యమవుతున్నారు. ప్రజాభిప్రాయసేకరణ జరుగకుండా... సోషల్‌ ఇంపాక్ట్‌ సర్వే చేపట్టకుండా ఓడరేవు నిర్మించాలన్న మంత్రివర్గ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. దేవునల్తాడ గ్రామంలోని పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేబినెట్‌ నిర్ణయంపై అవసరమైతే  సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. 
2013లో భూసేకరణ చట్టం తుంగలోకి తొక్కి పర్యావరణ అనుమతులు లేకుండా ముసాయిదాలను ప్రకటించకుండా సర్కారు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాన్ని వారు ఖండిస్తున్నారు. మత్స్యకారులకు అవసరమైన  ఫిషింగ్ హార్బర్ తప్ప.. మరేఇతర అవసరాల కోసమూ భావనపాడు ప్రాంతాన్ని వాడుకోవద్దని కోరుతున్నారు. ఓడరేవు నిర్మాణానికి సర్కార్‌ తీసుకున్న నిర్ణయంతో రైతులతో పాటు, మత్స్యకారులు ఎంతగానో నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
ఎవరి ఇళ్లకు నష్టముండదని గతంలో చెప్పిన పాలకులు
దేవునల్తాడ, భావనపాడు ప్రాంతాలలో ఎవరి ఇళ్లకు నష్టం ఉండదని  గతంలో పాలకులు ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఏడువేల మందికి పునరావాసం కల్పించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడంపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది. కేబినెట్‌ నిర్ణయం  వెనుక మతలబు ఏమిటో చెప్పాలని  స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతరేకంగా సర్కారు ఏకపక్షంగా హార్బర్ కాదని ఓడరేవు నిర్మించాలని చూస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వైకాపా నేతలు హెచ్చరిస్తున్నారు.  
పోర్టు నిర్మాణం కోసం పాలకుల అత్యుత్సాహం
ఎన్‌వోసీ  లేకుండా పోర్టు నిర్మాణం కోసం పాలకులు చూపిస్తున్న అత్యుత్సాహం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే భావనపాడు ప్రాంతాలలో క్రయవిక్రయాలు నిలిచిపోయి  బాధితులకు ఎంతగానో నష్టం కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గం ఫిషింగ్ హార్బర్ కాకుండా ఓడరేవు నిర్మిస్తామని ఆదానీ గ్రూప్ తో చేసుకున్న ఒప్పందంపై  పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
 

Don't Miss