’చెత్త’ సమస్య సీఎం ఐనా పరిష్కరిస్తాడా?

09:10 - June 19, 2017

చిత్తూరు : ఆహ్లాదకర వాతావరణానికి మారు పేరు తిరుపతి నగరం. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వేలాది మంది భక్తులతో నగరం నిత్యం సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక వాతావరణంతో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ నగరం ఇపుడు చెత్త సమస్యతో సతమతం అవుతోంది.

డంపింగ్‌ యార్డులుగా తిరుపతి వీధులు..
చెత్త తరలింపులో సమస్య రావడంతో తిరుపతి వీధులు డంపింగ్‌ యార్డులుగా మారిపోయాయి. నగరంలో ప్రతిరోజు సుమారు 190 మెట్రిక్ టన్నుల చెత్త పోగుపడుతుంది. తిరుపతి కార్పొరేషన్ కు చెందిన సుమారు 50 ట్రాక్టర్లు ఈ చెత్తను తరలించే పనిలో ఉంటాయి. ఈ చెత్తను తిరుపతికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురం గ్రామ శివారులో డంప్‌చేసేవారు. అయితే రామాపురం పరసర గ్రామాలప్రజలు చెత్తడంపింగ్‌ను వ్యతిరేకించడంతో సమస్యవచ్చిపడింది. చుట్టుపక్కల ఉన్న పది పంచాయితీల ప్రజలు తమ నివాసాల సమీపంలో తిరుపతి చెత్తను పారవేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

స్థానికుల ఆగ్రహం..
తిరుపతినుంచి చెత్తను మోసుకొచ్చే ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకుంటున్నారు. డంపింగ్‌ యార్డువల్ల తమ గ్రామాల్లో వ్యాధులు విజృంభిస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య మరింత ముదరకుండా ఎంపి శివప్రసాద్ సైతం సమస్య పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ నెల 22న సిఎం తిరుపతి పర్యటనకు ఉన్నందున పంచాయతీని ముఖ్యమంత్రికే వివరించి సమస్యను పరిష్కరిస్తానని ఎంపీ శివప్రసాద్‌ హామీ ఇచ్చారు. ఎంపీ శివప్రసాద్‌ హామీతో బాధిత గ్రామాల ప్రజలు తాత్కాలికంగా శాంతించారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన తర్వాత సమస్యను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. బాధిత గ్రామాల ప్రజలకు వైసీపీ నేతలు అండగా నిలిచారు. డంపింగ్‌యార్డును మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏదిఏమైనా.. తిరుపతి నగరానికి డంపింగ్‌ యార్డు సమస్య అంత తొందరగా తేలేలా కనిపించడంలేదు. డంపింగ్‌ కోసం కనీసం 50ఎకరాల స్థలం అవసరం. తిరుపతికి సమీపంలో అంతటి విశాలస్థలం ఇప్పటికిపుడు అందుబాటులోకి తేవాలంటే సమస్యే అంటున్నారు అధికారులు. ముఖ్యమంత్రి జోక్యంతో అయినా ఈ చెత్తసమస్యకు పరిష్కారం లభించాలని తిరుపతి వాసులు కోరుకుంటున్నారు.

Don't Miss