ఎండతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం

10:53 - May 19, 2017

హైదరాబాద్ : మండుతున్న ఎండల తీవ్రతతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలు దాటితే చాలు.. ఎండ మంట, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోడ్లపై జన సంచారం కనిపించడం లేదు. నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సూర్యుడి కర్ఫ్యూకి.. జనం బయటకు రావాలంటేనే జడుసుకుంటున్నారు. ఈ వేసవి నిప్పుల కొలిమేనని భారత వాతావరణ విభాగం మార్చి నెలలో ప్రకటించింది. అన్నట్లుగానే వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఎండలు రానున్న రోజుల్లో మరింత ముదరనున్నాయి.

నిర్మానుష్యంగా వీధులు
నిత్యం రద్దీగా కనిపించే వీధులు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాలుల ప్రభావంతో రాత్రి ఏడైనా భూగర్భం నిప్పుల కొలిమిలా ఉంటోంది. వాతావరణ శాఖ నిపుణుల అంచనా ప్రకారం తెలంగాణలోని భూ ఉపరితల వాతావరణం వేడెక్కటం.. ఉత్తర భారతదేశం నుంచి వేడిగాలులు తెలంగాణ వైపు వీస్తుండటంతో అత్యంత వేడి నెలకొంటోంది. ఎండ వేడి వల్ల కళ్లు తిరగడం, శరీరం త్వరగా అలసిపోవడం జరుగుతుంది. నీళ్లు ఎక్కువగా తాగకపోయినా.. చల్లని పదార్థాలను తీసుకోకపోయినా ఈ ఎండలను తట్టుకోవడం చాలా కష్టం. నిమ్మకాయ, పుచ్చకాయ, కొబ్బరిబోండాం, మజ్జిగ ఒంట్లో వేడిని తగ్గించడానికి ఎంతో శ్రేష్టం. కాబట్టి ద్రవ పదార్థాలను తీసుకుంటూనే ఉండటం మంచిది. ఇక ఈ వేసవి తాపానికి పెద్దలే తట్టుకోలేకపోతోంటే.. ఇక చిన్నారుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అంగన్‌వాడీ సెంటర్లలో.. ఎండల వేడికి పిల్లలు కుతకుతలాడిపోతున్నారు. ఎలాంటి సదుపాయాలు లేని అద్దె భవనాల్లో అంగన్‌వాడీ సెంటర్లు నిర్వహిస్తున్నారు. కట్టెల పొయ్యిపై వంట చేస్తుండటంతో అటు ఎండ, ఇటు మంట వేడికి పిల్లలు అల్లాడిపోతున్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Don't Miss